Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..

Hero Motocorp

Hero Motocorp

హీరో మోటోకార్ప్ భారతీయ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ‘సూపర్ స్ప్లెండర్’ సిరీస్, 1990ల నాటి నుంచి నేటికీ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఈ ఐకానిక్ బైక్‌ను మరింత ఆధునీకరిస్తూ, హీరో మోటోకార్ప్ సరికొత్త ‘సూపర్ స్ప్లెండర్ XTEC 2.0’ మోడల్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. నిత్యం ప్రయాణాలు చేసే ఉద్యోగులు, యువతను ఆకట్టుకునేలా అద్భుతమైన ఫీచర్లు, సరికొత్త డిజైన్, ఆకర్షణీయమైన ధరతో ఈ బైక్‌ను రూపొందించారు. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం దీనిని రూ. 86,500 లకే అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

ఈ సరికొత్త మోటార్ సైకిల్ కేవలం రవాణాకే పరిమితి కాకుండా.. రైడర్లకు గరిష్ట మైలేజ్ , ఆధునిక కనెక్టివిటీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో అమర్చిన 124.7cc సింగిల్-సిలిండర్ ఇంజన్ 7,500 rpm వద్ద 10.7 bhp శక్తిని, 6,000 rpm వద్ద 10.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పాటు హీరో సంస్థకు చెందిన i3S ఐడల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వల్ల ఈ బైక్ లీటరుకు ఏకంగా 72 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ ఆగినప్పుడు శబ్దం లేకుండా, చాలా సులువుగా స్టార్ట్ అవ్వడానికి వీలుగా ఇందులో ‘ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్’ ఫీచర్‌ను జతచేశారు.

టెక్నాలజీ పరంగా చూస్తే.. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్లు, మిస్డ్ కాల్ నోటిఫికేషన్లు, ఫోన్ బ్యాటరీ శాతాన్ని రైడర్లు సులభంగా చూసుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ కోసం ఒక యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయల్ ఇండికేటర్ వంటి అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తూ సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లోనే మొదటిసారిగా ఇందులో హజార్డ్ లైట్లను ప్రవేశపెట్టారు. దాంతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హ్యాండిల్‌బార్‌పైనే ఇంజన్ కిల్ స్విచ్ వంటి సేఫ్టీ ఫీచర్లు రైడర్లకు పూర్తి రక్షణను ఇస్తాయి.

ఆకట్టుకునే డ్యూయల్-టోన్ బాడీ గ్రాఫిక్స్, స్టైలిష్ ఎక్స్‌టెక్ 2.0 బ్యాడ్జింగ్, రిమ్ టేపులు, డ్యూయల్-టెక్స్చర్డ్ సీటుతో ఈ బైక్ క్లాసిక్ లుక్‌తో పాటు ఆధునిక లుక్‌ను సంతరించుకుంది. ఇది గ్లోసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ, మ్యాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ వంటి ఐదు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తోంది. ప్రస్తుతం ఈ సరికొత్త సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో విక్రయానికి సిద్ధంగా ఉంది. ప్రయాణంలో సౌకర్యాన్ని, ఆధునిక సాంకేతికతను ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.