Site icon NTV Telugu

Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి

Stock Market Crash

Stock Market Crash

Stock Market Crash: మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు, బ్యాంకులకు సుమారు ₹1.5 లక్షల కోట్ల లిక్విడిటీ మద్దతు, తటస్థ వైఖరి వంటి కారణాల వల్ల అందరూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల వైపు పరుగులు పెడుతుందని భావించారు, కానీ ఆ అంచనాలు తప్పు అయ్యాయి. మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తూ స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. మార్కెట్ మొదలైన కొన్ని గంటల్లోనే పెట్టుబడిదారులు సుమారు ₹8 లక్షల కోట్లు కోల్పోయారు. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ 280 పాయింట్లకు పైగా క్షీణించిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.

READ ALSO: Sri Satya Sai District : సత్యసాయి జిల్లాలో హవాలా డబ్బు దోచుకున్న దొంగలు !

పలువురు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇండిగో షేర్ల పతనం మార్కెట్ సెంటిమెంట్‌ను గణనీయంగా దెబ్బతీసిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం సమావేశం కానుంది, అలాగే పలు కారణాల వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్త పడ్డారు. దీంతో పాటు రూపాయి క్షీణత, ముడి చమురు ధరలు పెరగడం కూడా స్టాక్ మార్కెట్ క్షీణతకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీలు..
సోమవారం స్టాక్ మార్కెట్ గణనీయమైన క్షీణతను చవిచూసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈరోజు సెన్సెక్స్ 85,624.84 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం సెన్సెక్స్ 85,712.37 వద్ద ముగిసింది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు సెన్సెక్స్ దాదాపు 745 పాయింట్లు తగ్గి 84,969.11 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ కూడా గణనీయమైన క్షీణతతో ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ దాదాపు 280 పాయింట్లు తగ్గి 25,922.10కి చేరుకుంది. ఈ రోజు నిఫ్టీ 26,159.80 వద్ద ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు నిఫ్టీ 253.60 పాయింట్లు తగ్గి 25,932.60 వద్ద ట్రేడవుతోంది.

స్టాక్ మార్కెట్ క్రాష్ కావడానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే..

సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ఇండిగో: ఇండిగో సంక్షోభం ఇంకా ముగియకపోవడం, అదే సమయంలో ప్రభుత్వం ఇండిగోకు నోటీసు పంపడం, కంపెనీ స్పందించకపోతే కేంద్రం తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు రావడంతో సోమవారం మార్కెట్ సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో సోమవారం ఇండిగో షేర్లు 7% వరకు క్షీణించాయి.

US ఫెడ్ సమావేశం: డిసెంబర్ 9న ప్రారంభమయ్యే రెండు రోజుల ఫెడ్ సమావేశానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వైఖరిని అవలంబిస్తున్నారు. రాబోయే FOMC సమావేశం, అదనపు ద్రవ్యోల్బణం విడుదలలు, ఇయర్ ఎండింగ్ పోర్ట్‌ఫోలియో సర్దుబాట్ల ముందు పెట్టుబడిదారులు జాగ్రత్త వైఖరిని కొనసాగిస్తు్న్నారని HDFC సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకులు కూడా ఈ వారం సమావేశం కానున్నాయని, అయితే ఫెడ్ వెలుపల ఏ కేంద్ర బ్యాంకు కూడా విధాన మార్పులు చేయదని ఆయన వెల్లడించారు.

విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం రూ.438.90 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. వాస్తవానికి ఇది స్టాక్ మార్కెట్ నుంచి వరుసగా ఏడవ సెషన్ నికర ఉపసంహరణలు. డిసెంబర్‌లో విదేశీ పెట్టుబడిదారులు రూ.11 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు.

రూపాయి పతనం: ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం వల్ల ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 16 పైసలు బలహీనపడి 90.11కి చేరుకుంది. ఫారెక్స్ డీలర్ల ప్రకారం.. స్థానిక కరెన్సీ 90.07 వద్ద ప్రారంభమైంది, అయితే కార్పొరేట్లు, దిగుమతిదారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నుంచి బలమైన డాలర్ డిమాండ్ కారణంగా ఇది మరింత పడిపోయింది.

ముడి చమురు ధరలు పెరగడం: గల్ఫ్ దేశాలు ఉత్పత్తి చేసే బ్రెంట్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 0.13% పెరిగి $63.83కి చేరుకుంది. అధిక ముడి చమురు ధరలు భారతదేశ దిగుమతి బిల్లు, ఇంధన ద్రవ్యోల్బణ ఆందోళనలపై ఒత్తిడి తెస్తాయని, ఇది తరచుగా స్టాక్ మార్కెట్‌కు సెంటిమెంట్‌కు దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మొత్తంగా స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు చూసిన క్షీణత కారణంగా మదుపరులు గణనీయమైన నష్టాలను చవిచూశారు. వాస్తవానికి పెట్టుబడిదారుల నష్టాల పరిధి అనేది BSE మార్కెట్ క్యాప్‌పై ఆధారపడి ఉంటుంది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసినప్పుడు BSE మార్కెట్ క్యాప్ రూ.4,70,96,826.75 కోట్లుగా ఉంది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ.4,63,01,207.86 కోట్లకు పడిపోయింది. అంటే BSE మార్కెట్ క్యాప్ రూ.7,95,618.89 కోట్లు కోల్పోయింది.

READ ALSO: Delhi Drug Trafficking: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత.. అడ్డంగా బుక్ అయిన కేటుగాళ్లు

Exit mobile version