Silver Price Hike: దేశంలో బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే విలువైన లోహం ‘వెండి’. తాజాగా కేంద్ర ప్రభుత్వం వెండి ప్రియులకు గట్టి షాక్ ఇచ్చింది. వెండి ఆభరణాలు, నాణేలు లేదా పాత్రలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న సామాన్యులపై రాబోయే రోజుల్లో భారీ భారం పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో వెండి దిగుమతి నిబంధనలను ప్రభుత్వం అత్యంత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు ‘స్వేచ్ఛా’ జాబితాలో ఉన్న వెండి దిగుమతులను తక్షణమే ‘నియంత్రిత’ (Restricted) జాబితాలోకి మారుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, పొడి రూపంలో ఉన్న వెండి లేదా పాక్షికంగా తయారైన వెండిని దిగుమతి చేసుకోవాలంటే ఇకపై ప్రభుత్వ అధికారుల నుంచి ముందస్తు లైసెన్స్ లేదా అనుమతి తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్లో వెండి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపి, వాటి ధరలు విపరీతంగా పెరిగేందుకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కఠిన నిర్ణయం కేంద్రం ఎందుకు తీసుకుందంటే…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా భారత విదేశీ మారక నిల్వలపై భారం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు ఏకంగా రెండున్నర రెట్లు పెరిగి 12.1 బిలియన్ డాలర్లకు చేరడం, డాలర్ సరఫరాపై ఒత్తిడి పెంచింది. దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లడాన్ని తగ్గించేందుకు, వాణిజ్య లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఈ వ్యూహాత్మక చర్య తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే.. ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని (Import Duty) 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఏడాది పాటు దేశ ప్రజలెవ్వరూ బంగారం కొనుగోలు చేయవద్దని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి భారతదేశానికి స్వంతంగా వెండి ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా తక్కువ, దీంతో ప్రజల అవసరాల కోసం సుమారుగా 80 శాతానికి పైగా విదేశీ దిగుమతులపైనే ఇండియా ఆధారపడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ కొత్త ఆంక్షల వల్ల మార్కెట్లోకి వెండి రాక తగ్గి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో సిల్వర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే వేగంగా దూసుకుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. కేంద్రం నిర్ణయంతో సిల్వర్ సఫ్లై చైన్ దెబ్బతింటుందనే భయంతో వ్యాపారవేత్తలు వెండిని పెద్ద ఎత్తున నిల్వ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల వెండి డిమాండ్ పెరిగి, చివరకు ఆ అదనపు భారం అంతా సామాన్య వినియోగదారుడి జేబుకే చిల్లు పెట్టనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
