SBI: అమెరికాలోని భారతీయ ప్రవాసులకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అదిరిపోయే తీపి కబురు అందించింది. అమెరికా గడ్డపై తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ, ప్రవాస భారతీయులు అత్యధికంగా నివసించే టెక్సాస్ రాష్ట్రంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఎస్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కాలిఫోర్నియా)’.. టెక్సాస్‌లోని ప్రముఖ నగరమైన ఫ్రిస్కోలో సరికొత్త శాఖను ఘనంగా ప్రారంభించింది. కాలిఫోర్నియా వెలుపల ఈ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన తొలి బ్రాంచ్ ఇదే కావడం విశేషం.
వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్ డల్లాస్ ప్రాంతంలో ఐటీ నిపుణులు, భారతీయ పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో స్థిరపడ్డారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రిస్కో శాఖను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఎస్బీఐ గ్రూప్ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి స్వయంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ మంజునాథ్, ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథులుగా హాజరై బ్యాంక్ సేవలను ప్రారంభించారు. ఈ సరికొత్త శాఖ ద్వారా భారతీయ ప్రవాసులు, వ్యాపారవేత్తలకు పలు కీలక సేవలు అందుబాటులోకి వచ్చాయి.
* వ్యక్తిగత, వ్యాపార డిపాజిట్ ఖాతాలు
* వ్యాపార విస్తరణకు అవసరమైన వాణిజ్య రుణాలు
* భారత్‌కు క్షణాల్లో నిధులు పంపే సురక్షితమైన అంతర్జాతీయ నగదు బదిలీ సేవలు
* స్థానిక నిపుణులు, కంపెనీలకు ప్రత్యేక బ్యాంకింగ్ వెసులుబాట్లు
భారత్ – అమెరికా మధ్య ఆర్థిక, వాణిజ్య బంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రవాస భారతీయులకు మాతృదేశ బ్యాంకింగ్‌ను మరింత చేరువ చేయడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని కాన్సుల్ జనరల్ మంజునాథ్ స్పష్టం చేశారు. ఈ కొత్త బ్రాంచ్‌తో కలిపి అమెరికాలో ఎస్బీఐ కాలిఫోర్నియా శాఖల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇవి కాకుండా న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజిల్స్‌లలో పూర్తిస్థాయి శాఖలు, వాషింగ్టన్లో ప్రతినిధి కార్యాలయంతో అమెరికాలో ఎస్బీఐ బలమైన నెట్‌వర్క్‌ను కొనసాగిస్తోంది.
అంతర్జాతీయంగా బ్యాంక్ విస్తరణ వేగవంతం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేర్లకు డిమాండ్ పెరిగింది. నెల రోజుల వ్యవధిలోనే ఎస్బీఐ షేరు విలువ 8 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇటీవల ఒక్కరోజే 1 శాతం పెరిగి రూ.1,016 స్థాయికి చేరుకుంది. గత వారంలోనే దాదాపు 4 శాతం రాణించడంతో బ్యాంక్ మార్కెట్ విలువ ఏకంగా రూ.9.38 లక్షల కోట్లకు ఎగబాకింది. అమెరికాలో సరికొత్త విస్తరణల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బ్యాంకు వ్యాపారంతో పాటు షేరు విలువ మరింత పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

