నెల చివర జీతం పడుతుందా లేదా అనే ఒక్క ప్రశ్న మీద కోట్ల మంది కుటుంబాల జీవితం నడుస్తోంది. జీతం ఆలస్యమైతే ఆ ప్రభావం ఆఫీస్ వరకే ఆగదు. ఇంటి ఖర్చులు గందరగోళంగా మారతాయి. అప్పులు పెరుగుతాయి. ఒత్తిడి మొదలవుతుంది. అయినా చాలా కంపెనీలు జీతం ఆలస్యం చేయడాన్ని సాధారణ విషయంలా తీసుకుంటున్నాయి.
కొన్నిచోట్ల సగం జీతమే ఇస్తారు. కొన్నిచోట్ల రిజైన్ చేసిన తర్వాత నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ పేరుతో డబ్బు ఆపేస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాథమిక విషయం చాలామందికి తెలియదు. జీతం ఇవ్వడం కంపెనీ ఇష్టంపై ఆధారపడే విషయం కాదు. అది చట్టం ద్వారా నిర్దేశించిన బాధ్యత. పని పూర్తయ్యాక జీతం ఇవ్వకపోవడం తప్పు మాత్రమే కాదు. అది నేరుగా ఉద్యోగి హక్కుల ఉల్లంఘన. ఇంతకీ జీతం ఆలస్యం అయితే చట్టం ఏం చెబుతోంది? ఉద్యోగి ఏం చేయొచ్చు? ఎక్కడికి వెళ్లొచ్చు? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
భారత్‌లో జీతం చెల్లింపు అనేది కంపెనీ ఇష్టం కాదు. అది చట్టం ద్వారా నిర్దేశించిన బాధ్యత. ఉద్యోగి పని చేసిన క్షణం నుంచి జీతం అతని హక్కుగా మారుతుంది. ఈ విషయంలో కంపెనీ పరిస్థితులు, అంతర్గత ప్రక్రియలు, క్యాష్ ఫ్లో సమస్యలు లాంటివి చట్టానికి అవసరంలేని విషయాలు. ఈ అంశాన్ని కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 2019లో స్పష్టంగా డిఫైన్ చేశారు. ఈ చట్టం ప్రకారం నెలవారీగా జీతం తీసుకునే ఉద్యోగులకు శాలరీ చెల్లించాల్సిన గడువు ఖచ్చితంగా నిర్ణయించి ఉంటుంది.
సాధారణంగా ప్రతి నెల ముగిసిన తర్వాత వచ్చే నెల 7వ తేదీలోపు జీతం ఖాతాలో పడాలి. పెద్ద సంస్థల విషయంలో, ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల, గరిష్టంగా 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ తేదీలు దాటితే అది జీతం ఆలస్యం కిందే పరిగణిస్తారు. పని పూర్తయిన తర్వాత జీతం ఇవ్వకపోవడానికి కంపెనీకి ఎలాంటి చట్టపరమైన వెసులుబాటు లేదు. అయినా వాస్తవంలో చాలా చోట్ల సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. కానీ చట్టం ప్రకారం ఇది సరైన విధానం కాదు. ఉద్యోగి చేసిన పనికి పూర్తి జీతం ఇవ్వాల్సిందే. జీతం నుంచి కోతలు కూడా ఇష్టారాజ్యంగా చేయలేరు. చట్టం అనుమతించిన కారణాలు తప్ప ఇతర కారణాలతో జీతం తగ్గించడం లేదా నిలిపివేయడం చట్టవిరుద్ధం. శిక్షగా జీతం ఆపేయడం, లేదా పనితీరు పేరుతో సగం మాత్రమే చెల్లించడం లాంటి చర్యలు చట్టబద్ధంగా నిలబడవు.
ఇక ఉద్యోగి జాబ్ రిజైన్ చేసిన తర్వాత పరిస్థితి మరింత స్పష్టంగా ఉంటుంది. రాజీనామా చేసినా, తొలగించినా, లేదా కాంట్రాక్ట్ ముగిసినా, ఉద్యోగి సంపాదించిన జీతం ఎక్కడికీ పోదు. చివరి పని దినం వరకు చేసిన పనికి సంబంధించిన జీతం తప్పనిసరిగా చెల్లించాలి. వేతన చట్టాల ప్రకారం ఉద్యోగిని తొలగించిన సందర్భాల్లో రెండు వర్కింగ్ డేస్‌లోనే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పూర్తవాలి. వారాలు, నెలల తరబడి ఫైల్ క్లియరెన్స్ పేరుతో డబ్బు ఆపేయడాన్ని చట్టం ఒప్పుకోదు. చాలా మంది కంపెనీలు ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పూర్తికాలేదని, లేదా అంతర్గత అప్రూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయని కారణాలు చెబుతుంటాయి. కానీ చట్టం దృష్టిలో ఇవి సరైన కారణాలు కావు. పని చేసినందుకు వచ్చే జీతాన్ని ఏ కారణంతోనూ నిలిపివేయలేరు. ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా ఆ బాధ్యత కంపెనీపై ఉంటుంది.
ఇక్కడ ఇంకో కీలక అంశం మినిమమ్ వేజ్. భారత్‌లో ఏ ఉద్యోగినైనా ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువగా చెల్లించడం చట్టవిరుద్ధం. కంపెనీ పాలసీ అయినా, ఉద్యోగి ఒప్పందం అయినా, ఉద్యోగి అంగీకారం అయినా మినిమమ్ వేజ్‌ను దాటలేవు. మినిమమ్ వేజ్ చట్టం అనేది అన్ని ప్రైవేట్ ఒప్పందాల కంటే పై స్థాయిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగికి కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. జీతం ఆలస్యం అయితే, సగం మాత్రమే చెల్లిస్తే, లేదా ఎగ్జిట్ తర్వాత డబ్బు ఆపేస్తే, ఉద్యోగి లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చు. పెండింగ్ వేతనాల రికవరీ కోసం దరఖాస్తు చేయవచ్చు. అవసరమైతే లీగల్ నోటీస్ కూడా ఇవ్వవచ్చు. ఇవి ఉద్యోగిని రక్షించేందుకు చట్టం ఇచ్చిన హక్కులు. కానీ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఈ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు.
ఇక అందరూ ఓ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. జీతం అనేది గిఫ్ట్ కాదు. అది పని చేసిన ప్రతి ఉద్యోగికి చట్టం హామీ ఇచ్చిన హక్కు. ఈ హక్కులపై అవగాహన ఉండటం మాత్రమే ఉద్యోగిని రక్షించగలదు. అవగాహన ఉన్న చోటే గౌరవం ఉంటుంది. గౌరవం ఉన్న చోటే మీరు చేసే పని నిజమైన విలువను పొందుతుంది.
ALSO READ: చీకటి గుహల్లో నేర సామ్రాజ్యం.. భారతీయులే టార్గెట్!
