Recykal: సచిన్ టెండూల్కర్ సరికొత్త ఇన్నింగ్స్.. క్లీన్ ఇండియా కోసం మాస్టర్ బ్లాస్టర్ బిగ్ స్టెప్!

Sachin Tendulkar

Sachin Tendulkar

Recykal: క్రికెట్ గ్రౌండ్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఇప్పుడు క్లీన్ ఇండియా కోసం మరో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వేస్ట్ మేనేజ్‌మెంట్ టెక్ కంపెనీ ‘రీసైకల్’లో సచిన్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్‌గా చేరారు. దేశంలోని వంద కోట్ల మంది ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చి, చెత్త నిర్వహణను ప్రతి ఒక్కరి రోజువారీ అలవాటుగా మార్చాలనే లక్ష్యంతో సచిన్ ఈ కీలక అడుగు వేశారు. ఇటీవల రీసైకల్ ప్రకటించిన 23 మిలియన్ డాలర్ల బ్రిడ్జ్ రౌండ్‌కు సచిన్ పెట్టుబడి మరింత బలాన్ని ఇచ్చింది.

దేశంలో పేరుకుపోతున్న చెత్త సమస్యను కేవలం టెక్నాలజీతోనే కాకుండా, జనం అలవాట్లు మార్చడం ద్వారా పరిష్కరించవచ్చని సచిన్, రీసైకిల్‌ను బలంగా నమ్ముతున్నారు. చెత్తను పనికిరాని వస్తువులా బయట పడేయకుండా, దానిని రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగించుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడమే ఈ పార్ట్‌నర్‌షిప్ మెయిన్ టార్గెట్‌గా చెప్పారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. “నా కెరీర్ మొత్తంలో విజయం అనేది క్రమశిక్షణ, నిరంతర కృషిపైనే ఆధారపడి ఉంటుందని నేర్చుకున్నాను. పరిశుభ్రమైన భారత్‌ను నిర్మించడానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. రోజువారీ చెత్త సమస్యను పరిష్కరించడానికి రీసైకల్ టెక్నాలజీని వాడుతున్న తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. వంద కోట్ల మంది ప్రవర్తనలో మార్పు తేవాలనే వీరి లక్ష్యం నాకు నిజంగా నచ్చింది” అని చెప్పుకొచ్చారు.

2015లో హైదరాబాద్ కేంద్రంగా మొదలైన రీసైకల్, డిపాజిట్ రిటర్న్ సిస్టమ్స్ (DRS), ఏఐ (AI) ఆధారిత రివర్స్ వెండింగ్ మెషీన్ల ద్వారా రీసైక్లింగ్ రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తోంది. సచిన్ రాకపై కంపెనీ సీఈఓ, కో-ఫౌండర్ అభయ్ దేశ్‌పాండే స్పందిస్తూ.. “ఎన్నో ఏళ్లుగా తన క్రమశిక్షణ, నిజాయితీతో భారతీయులందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన సచిన్ మాతో చేరడం చాలా ఆనందంగా ఉంది. పర్యావరణానికి మేలు చేయడాన్ని అందరికీ ఒక అలవాటుగా మార్చే ఉద్యమానికి ఆయన పెద్ద స్ఫూర్తిగా నిలుస్తారు” అన్నారు. ఇప్పటికే హిందుస్థాన్ యూనిలీవర్, శాంసంగ్, BMW లాంటి 650కి పైగా పెద్ద బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్న రీసైకల్, 30 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను రీసైకిల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.