Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?

Rapido

Rapido

Rapido: అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలని బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే అమాయక ప్రయాణికుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ‘రాపిడో’కు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. “ఎక్కువ డబ్బులు చెల్లిస్తేనే మీకు రైడ్ దొరుకుతుంది.. లేదంటే లేదు” అనే తరహాలో కస్టమర్లను పరోక్షంగా బెదిరింపులకు గురిచేస్తూ దోపిడీకి పాల్పడుతున్న రాపిడోపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) కొరడా ఝళిపించింది. రాపిడో మాతృసంస్థ రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌పై ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది.

యాప్‌లోనే పచ్చి మోసం..

సాధారణంగా రాపిడోలో రైడ్ బుక్ చేసే సమయంలో మొదట ఒక ధరను చూపిస్తారు. తీరా బుకింగ్ ప్రక్రియ మొదలయ్యాక.. “డ్రైవర్లు ఈ ధరకు రావట్లేదు.. రూ.10, రూ.20 లేదా రూ.30 అదనంగా జోడించండి” అంటూ యూజర్లపై ఒత్తిడి తీసుకొస్తారు. అంతేకాకుండా “Higher the price, higher the chance of getting a ride” (ఎక్కువ ధర చెల్లిస్తేనే రైడ్ దొరికే అవకాశం ఎక్కువ) అనే మెసేజ్‌లతో ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారు. యాప్ స్క్రీన్‌పై రంగుల జిమ్మిక్కులతో సైకాలజికల్ గేమ్‌కు తెరతీసినట్లు CCPA విచారణలో తేలింది. ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫెరెన్స్: ‘సెట్ యువర్ ప్రైస్’ ఫీచర్‌లో ఎక్కువ ఛార్జీని ఎంచుకుంటే స్క్రీన్‌పై పచ్చ రంగు చూపిస్తూ రైడ్ త్వరగా వస్తుందని నమ్మిస్తారు. అదే తక్కువ మొత్తం ఉంచితే ఎరుపు లేదా నారింజ రంగు సంకేతాలు ఇచ్చి భయపెడతారు. యూజర్లు అదనపు మొత్తం ఇవ్వకపోతే తామేదో తప్పు చేస్తున్నామన్న భావన కలిగించేలా మానసిక ఒత్తిడి పెంచుతారు.

బుకింగ్ టైమ్‌లోనే ‘టిప్’ దోపిడీ..

మోటారు వాహన నిబంధనల ప్రకారం.. రైడ్ ముగిసిన తర్వాత మాత్రమే కస్టమర్ తన ఇష్టపూర్వకంగా ‘టిప్’ ఇచ్చే వెసులుబాటు ఉండాలి. కానీ, రాపిడో సంస్థ అసలు రైడ్ స్టార్ట్ కాకముందే ప్రయాణికుడిపై టిప్ భారాన్ని మోపుతోందని కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చూపే ఛార్జీల్లో దూరం, ట్రాఫిక్, డ్రైవర్ వాటా అన్నీ కలిసి ఉన్నప్పుడు, బుకింగ్‌కు ముందే అదనపు భారం మోపడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. తమ వాదనలో భాగంగా రాపిడో “ఇది కేవలం ప్రయాణికుల ఇష్టం మాత్రమే” అని తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఎక్కువ డబ్బులిస్తేనే రైడ్ దొరుకుతుందనడానికి కంపెనీ వద్ద ఎలాంటి అధికారిక సాంకేతిక ఆధారాలు లేవని తేలింది.

ఓలా, ఉబర్‌లకూ చుక్కలు తప్పవా?
ఈ దోపిడీ కేవలం రాపిడోతోనే ఆగలేదు. ఓలా, ఉబర్, నమ్మ యాత్రి వంటి ఇతర ప్రసిద్ధ రైడ్ హెయిలింగ్ సంస్థల యాప్‌లలోనూ ఇలాంటి మోసపూరిత డిజైన్లు (డార్క్ ప్యాటర్న్స్) ఉన్నాయా అనే కోణంలో CCPA ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసింది. వినియోగదారులు ఇలాంటి యాప్‌ల చేతిలో మోసపోతే జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ 1915 కి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అత్యవసర ప్రయాణాల్లో ఉన్న కస్టమర్లను అడ్డంగా దోచుకోవాలనుకునే సంస్థలకు ఈ రూ.10 లక్షల జరిమానా ఒక గట్టి హెచ్చరికగా నిలవనుంది.