పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. మీ బ్యాంక్ ఖాతాలో గత రెండేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరపకపోతే.. వెంటనే కేవైసీ (KYC) పూర్తి చేయాలని సూచించింది. లేనిపక్షంలో ఏప్రిల్ 16, 2026 తర్వాత ఆ ఖాతాలను మూసివేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
‘ఇన్-ఆపరేటివ్’ (Inoperative) ఖాతా అంటే ఏమిటి.. ?
సాధారణంగా ఏదైనా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌లో వరుసగా రెండేళ్ల పాటు ఖాతాదారుడు ఎటువంటి లావాదేవీలు (డబ్బులు తీయడం లేదా వేయడం) చేయకపోతే.. ఆ ఖాతాను బ్యాంకులు ‘ఇన్-ఆపరేటివ్’ ఖాతాగా మారుస్తాయి. ఖాతా భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నిబంధనను పెట్టింది.
ఖాతాను మళ్లీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..?
మీ ఆగిపోయిన ఖాతాను మళ్లీ యాక్టివ్ లోకి తీసుకురావాలంటే.. హోమ్ బ్రాంచ్ ద్వారా సాధ్యమవుతుంది. మీరు అకౌంట్ తెరిచిన మీ సొంత బ్రాంచ్‌కు వెళ్లి ఒక వినతి పత్రం ఇచ్చి, కొత్త కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేదా.. బ్యాంక్ సౌకర్యాన్ని బట్టి ఇంట్లోనే కూర్చుని వీడియో కాల్ (V-CIP) ద్వారా లేదా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
కేవలం డబ్బులు పంపడం లేదా తీసుకోవడమే కాకుండా.. ఏటీఎం లేదా మొబైల్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం.. చెక్కు బుక్ లేదా క్రెడిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టడం.. నామినీ వివరాలను మార్చడం లేదా లావాదేవీల పరిమితిని మార్చడం అనేవి చేయడం ద్వారా మీ ఖాతా యాక్టివ్ లో ఉంటుందని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 15, 2026 లోపు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోకపోతే.. మీకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తుంది. కాబట్టి వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించడం ఉత్తమం.
