Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్‌లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌ గురించి తప్పక తెలుసుకోండి!

Pension Schem

Pension Schem

Pension Scheme: పొదుపు చిన్నదైనా భవిష్యత్ పెద్దదే… నెలకు ఖర్చయ్యే ఒక టీ ధరతో మొదలయ్యే పెట్టుబడి… వృద్ధాప్యంలో ప్రతి నెలా ఖచ్చితమైన ఆదాయం అందించే భరోసా… ఇదంతా ఏదైనా ప్రైవేట్ స్కీమ్ కాదు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక ప్రత్యేక పథకం. అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, గృహ కార్మికులు, చిన్న దుకాణాలు నిర్వహించే వారు వంటి అనేక మంది భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుందో అనే ఆందోళనతో జీవిస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాంధన్ యోజన వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ అందించే భద్రతా వలయంగా నిలుస్తోంది.

×
×
Ad

ఈ పథకంలో చేరాలంటే అభ్యర్థి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే నెలవారీ ఆదాయం 15 వేల రూపాయలకు మించకూడదు. ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందుతూ ఉండకూడదు. అంతేకాదు ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి కాకూడదు.

ఈ పథకంలోని అత్యంత ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, మీరు ఎంత మొత్తం జమ చేస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని మీ తరఫున జమ చేస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరిన వ్యక్తి నెలకు 55 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం కూడా మరో 55 రూపాయలు జమ చేస్తుంది. అదే 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి చందా మొత్తం మారుతుంది.

ఈ విధంగా నిరంతరం చందా చెల్లించిన సభ్యులు 60 ఏళ్ల వయస్సు పూర్తయ్యాక ప్రతి నెలా 3 వేల రూపాయల పెన్షన్ పొందుతారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరితే ఇద్దరికీ విడివిడిగా పెన్షన్ లభిస్తుంది. అంటే కుటుంబానికి నెలకు మొత్తం 6 వేల రూపాయల వరకు ప్రయోజనం అందుతుంది.

ఈ పథకంలో చేరాలని భావించే వారు సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి. అక్కడ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించి నమోదు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఒకసారి నమోదు అయిన తర్వాత ప్రతి నెలా చందా మొత్తాన్ని ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా మొత్తం డెబిట్ అవుతుంది.

అంతేకాదు ఈ పథకంలో కుటుంబ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యుడు 60 ఏళ్ల తర్వాత మరణిస్తే, అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి నెలకు 1,500 రూపాయల పెన్షన్ కొనసాగుతుంది. అంటే ప్రధాన పెన్షన్‌లో సగం మొత్తాన్ని జీవిత భాగస్వామి పొందే అవకాశం ఉంటుంది.

నెలకు కేవలం 55 రూపాయలతో ప్రారంభమయ్యే ఈ ప్రభుత్వ పథకం, అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఒక భరోసా పథకంగా నిలుస్తోంది. చిన్న మొత్తంతో మొదలయ్యే ఈ పెట్టుబడి, భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు బలమైన ఆధారంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.