PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!

Pm Kisan Yojana (2)

Pm Kisan Yojana (2)

PM Kisan Yojana : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 23వ విడత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ఈ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా విభజించి ఒక్కోసారి రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

×
×
Ad

ఇప్పటికే ఈ పథకం కింద 22 విడతలు విడుదలయ్యాయి. తాజాగా 22వ విడతను 2026 మార్చి 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి విడత మధ్య సుమారు నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే 23వ విడత విడుదలకు సంబంధించిన సమయం జూన్ నెలలో పూర్తవుతోంది.

అయితే గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే, నాలుగు నెలల గడువు పూర్తయిన వెంటనే నిధులు విడుదల కావడం తప్పనిసరి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 23వ విడత జూన్‌లో కాకుండా జూలై నెలలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జూన్ నెలలోనే విడత విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పథకానికి సంబంధించిన వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక తేదీ ప్రకటించబడలేదు.

ఇదిలా ఉంటే, పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు కొన్ని కీలక ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయడం, ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం, భూ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలు అత్యంత కీలకం. ఈ ప్రక్రియల్లో ఏదైనా పెండింగ్‌లో ఉంటే రైతులు విడత మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

అందువల్ల 23వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ పథకం ఖాతా వివరాలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించిన వెంటనే అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. దీంతో ఇప్పుడు రైతులందరి చూపు 23వ విడత విడుదల తేదీపైనే నిలిచింది.