NTV Telugu Site icon

PF Update: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌. ఇక వాళ్లు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు!

Epfo

Epfo

ఇప్పటిదాకా కనీసం 6 నెలల అనుభవం ఉన్నోళ్లే పీఎఫ్‌ అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇకపై అంతకన్నా తక్కువ సర్వీసు ఉన్నోళ్లు కూడా ఉపసంహరించుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే చాలా మంది ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే 1 నుంచి 6 నెలల లోపు ఉద్యోగం మానేసేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వాళ్లు వేరే సంస్థలో చేరితే యూఏఎన్‌ నంబర్‌ ఆధారంగా పాత, కొత్త పీఎఫ్‌ ఖాతాలను మెర్జ్‌ చేసుకుంటారు. కానీ ఇతర సంస్థల్లో చేరనివాళ్లు పీఎఫ్‌ అకౌంట్లను అలాగే వదిలేస్తున్నారు.

వాటిలోని డబ్బును వెనక్కి తీసుకునే ఛాన్స్‌ లేక నష్టపోతున్నారు. 6 నెలల లోపు అనుభవం ఉన్నోళ్లు సైతం పీఎఫ్‌ ఖాతాల్లోని అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకునే ఛాన్స్‌ ఇస్తే ఎంతో మందికి ఊరట లభిస్తుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో నమోదైన 73 లక్షల మంది పింఛన్‌దారులకు ఒకేసారి పెన్షన్‌ను డిపాజిట్‌ చేసేందుకు ఆమోదం లభించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలోని 138 రీజనల్‌ ఈపీఎఫ్‌ఓ ఆఫీసుల్లో వేర్వేరు తేదీల్లో లేదా ఒకే తేదీన వేర్వేరు సమయాల్లో అకౌంట్‌ హోల్డర్లకు డిపాజిట్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌ ప్రపోజల్‌ ప్రకారం సెంట్రల్‌ సిస్టమ్‌ అమల్లోకి రానుంది. దీంతో అందరికీ ఒకేసారి పింఛన్‌ సొమ్ము అందనుంది.