Site icon NTV Telugu

Petrol Price: ఏ క్షణమైనా పేలనున్న పెట్రో ధరల బాంబ్‌..!

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో మనదేశంలోనూ… పెట్రో మంట రేగడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు 10 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చని అంచనాలున్నాయి. ధరల పెరుగుదల ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు పురి.

Read Also: Gold Price: 19 నెలల గరిష్టానికి పసిడి ధర

దేశంలో చివరిసారిగా 2021 నవంబర్ 4న పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఆ టైమ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 81.5 డాలర్లుగా ఉంది. అది మార్చి 1 నాటికి 111 డాలర్లకు చేరింది. ఇప్పుడు 125 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ధరలు భారీగా పెరగడంతో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు రిటైల్‌గా ధరలను అదే స్థాయిలో పెంచకతప్పదని ఆయిల్ కంపెనీలంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హర్‌దీప్‌ సింగ్ పురి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ముడి చమురు కొరత ఉండదని, చమురు కంపెనీలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని అన్నారు.

Exit mobile version