UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!

Upi

Upi

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అంశం UPI చెల్లింపులపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) అమలు వ్యవహారం.. ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పెద్ద దుమారమే రేగింది.. కొంతమంది అనుకూలంగా ఉన్నా.. మెజార్టీ ప్రజలు, వ్యాపారులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.. రూ.2,000కు మించిన కొన్ని UPI మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం MDRను అక్టోబర్ 15, 2026 నుంచి అమలు చేయాలని NPCI ఇప్పటికే నిర్ణయించింది. అయితే పండుగ సీజన్ నేపథ్యంలో దీన్ని జనవరి 2027 వరకు వాయిదా వేయాలని వ్యాపార, ఫిన్‌టెక్, చెల్లింపుల సంస్థలు కోరుతున్నాయి. ఈ డిమాండ్‌పై NPCI, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

రూ.2,000 దాటితే ఎంత MDR?

ప్రస్తుత ప్రతిపాదిత విధానం ప్రకారం అర్హత కలిగిన Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై రూ.2,000 దాటితే 0.4 శాతం MDR వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.2,000 లావాదేవీపై రూ.8, రూ.10,000 చెల్లింపుపై రూ.40 MDR అవుతుంది. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300కే పరిమితం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే P2P చెల్లింపులు మాత్రం ఉచితంగానే కొనసాగుతాయి.

వినియోగదారులపై భారం పడుతుందా?

MDR అనేది వినియోగదారులు నేరుగా చెల్లించే రుసుము కాదు. ఇది వ్యాపారులపై విధించే ఛార్జీ. ఈ భారాన్ని వినియోగదారులపై బదిలీ చేయకుండా చూడాలని బ్యాంకులకు సూచనలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2,000లోపు UPI మర్చంట్ చెల్లింపులు కూడా MDR నుంచి మినహాయింపులోనే ఉంటాయి. అయితే, వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులపై రుద్దే అవకాశం లేకపోలేదు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది..

ఎందుకు వాయిదా వేయాలని కోరుతున్నారు?

కొత్త MDR విధానంలో వివిధ రకాల లావాదేవీలకు వేర్వేరు రేట్లు, నిబంధనలు ఉండటంతో పేమెంట్ కంపెనీలు, వ్యాపారులకు మరింత సమయం అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్‌లో పండుగ సీజన్ ప్రారంభం కావడంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త ఛార్జీల విధానం అమలు చేస్తే వ్యాపారులపై అదనపు నిర్వహణ భారం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రత్యేక విభాగాలకు వేర్వేరు ఛార్జీలు

రైల్వే టికెట్లు, ఇంధనం, బీమా, టెలికాం, యుటిలిటీ బిల్లులు వంటి కొన్ని విభాగాలకు 0.4 శాతం బదులు ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ విధించే విధానం ఉంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు తక్కువ రేటు వర్తిస్తుంది. చిన్న వ్యాపారులు కూడా మినహాయింపు పొందేలా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

NPCI నిర్ణయంపైనే అందరి దృష్టి

అక్టోబర్ 15 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో MDR అమలు వాయిదాపై పరిశ్రమ చేసిన విజ్ఞప్తిపై NPCI త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం జనవరి 2027 వరకు వాయిదా వేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే తుది నిర్ణయం వెలువడే వరకు అక్టోబర్ 15 నుంచే అమలు అవుతుందనే ప్రస్తుత షెడ్యూల్ కొనసాగుతోంది.