Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!

  • మధ్యతరగతికి మరో షాక్..
  • ఆగస్టు 1 నుంచి ధరల మోత..
  • నిత్యావసర వస్తువుల నుంచి కార్ల వరకు ధరల పెంపు..
  • టీ, సబ్బు, టీవీ, కార్లు అన్నీ ఖరీదు
Price Hike From August 1

Price Hike From August 1

Price Hike from August 1: పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు పెరగడంతో ఇప్పటికే చాలా వస్తువుల ధరలు పెరిగాయి.. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మరోసారి ద్రవ్యోల్బణం షాక్ ఇవ్వనుంది. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, కార్ల వరకు పలు ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై మరింత భారం పడే అవకాశం ఉంది… మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఎఫ్‌ఎంసీజీ (FMCG) ఉత్పత్తుల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరగవచ్చు. ముఖ్యంగా టీ, హెయిర్ ఆయిల్, సబ్బులు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో ఆర్థిక భారం కానుంది.

ఇక, ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ధరల పెరుగుదల కనిపించనుంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ల ధరలు 4 నుంచి 6 శాతం వరకు పెరగవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. ఆటోమొబైల్ రంగంలోనూ ధరల పెంపు తప్పదని కంపెనీలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో తయారీ వ్యయం అధికమైందని పేర్కొంటూ మారుతి సుజుకి ఆగస్టు నుంచి కొన్ని మోడళ్లపై రూ.30,000 వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. హోండా కార్స్, మెర్సిడెస్-బెంజ్ వంటి కంపెనీలు కూడా త్వరలోనే ధరలను సవరించే అవకాశం ఉంది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ప్రపంచ మార్కెట్ పరిస్థితులేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు, పామాయిల్ ధరల పెరుగుదల, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు అధికమవడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. సముద్ర రవాణా వ్యయం పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువలో హెచ్చుతగ్గులు కూడా దిగుమతి ఖర్చులను పెంచుతున్నాయి.

కంపెనీలు ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచనున్నట్లు తెలిపాయి. మొదట ప్రీమియం ఉత్పత్తులపై ధరలు పెంచి, తర్వాత చిన్న ప్యాకేజీల ధరలను సవరించే అవకాశం ఉంది. జూన్ త్రైమాసికంలో నష్టాలను పూర్తిగా వినియోగదారులపై మోపలేదని, మిగిలిన భారాన్ని సెప్టెంబర్ త్రైమాసికంలో మరో 2 నుంచి 5 శాతం వరకు ధరల పెంపు ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వస్త్ర కంపెనీలు కూడా కొత్త సీజన్ దుస్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని, జీడీపీ వృద్ధి రేటుపైనా ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరిమిత ఆదాయంతో జీవిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఉదయం టీ నుంచి కొత్త కారు కొనుగోలు వరకు ప్రతి ఖర్చు పెరగడంతో రాబోయే పండుగ సీజన్‌లో బడ్జెట్‌ను సమతుల్యం చేయడం పెద్ద సవాలుగా మారనుంది.