Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!

Indian Employees Emergency

Indian Employees Emergency

Indian Employees Emergency Savings: ఉద్యోగం ఏదైనా సరే.. కొంత సేవింగ్‌ చేసుకోవాలి.. అత్యవసర పరిస్థితుల్లో మీకు అది అండగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతారు.. అయితే, భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై గ్రాంట్ థార్న్టన్ భారత్ (Grant Thornton Bharat) నిర్వహించిన తాజా సర్వేలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో చాలామంది ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని భావిస్తున్నప్పటికీ, అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా లేదా ఆదాయం నిలిచిపోయినా ఏడాది పాటు కుటుంబ ఖర్చులు భరించే స్థాయిలో పొదుపులు లేవని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 83 శాతం మందికి ఏడాది పాటు ఆదాయం లేకపోయినా జీవించేందుకు సరిపడా పొదుపు లేదని వెల్లడైంది.

India’s Financial Resilience Report 2026: Insights into Income, Savings, Insurance and Household Financial Preparedness పేరుతో ఈ నివేదికను రూపొందించారు. 2025 నవంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం 528 మందిని సర్వే చేశారు. వీరిలో 87 శాతం మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు కాగా, 71 శాతం మంది టైర్-1 నగరాల్లో నివసిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆదాయం నిలిచిపోతే ఏడాది పాటు సరిపడా పొదుపులు లేవని 83 శాతం మంది చెప్పడం గమనార్హం. అంటే, ఉద్యోగం ఉంటే ఓకే.. అది ఊడిందా..? పరిస్థితి అంతా తారుమారు అన్నట్టే..

జీతంపైనే అత్యధికుల ఆధారం
సర్వే ప్రకారం 91 శాతం మంది ఉద్యోగులకు జీతమే ప్రధాన ఆదాయ వనరు. పెట్టుబడుల ద్వారా ఆదాయం పొందుతున్నవారు కేవలం 29 శాతం మాత్రమే. వ్యాపారం, అద్దె ఆదాయం లేదా అదనపు ఉద్యోగాల ద్వారా సంపాదిస్తున్నవారు 10 శాతం కంటే తక్కువగా ఉన్నారు. మహిళల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దాదాపు 94 శాతం మంది మహిళలు ఉద్యోగ ఆదాయంపైనే ఆధారపడుతుండగా, 69 శాతం మందికి ఇతర ఆదాయ మార్గాలే లేవని వెల్లడైంది.

జీతాల పెరుగుదలపై అసంతృప్తి
పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తమ జీతాలు పెరగడం లేదని చాలామంది ఉద్యోగులు భావిస్తున్నారు. సర్వేలో 62 శాతం మంది తమ జీతాల పెరుగుదల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 25 నుంచి 34 ఏళ్ల వయసు గల వారిలో ఈ ఆందోళన 70 శాతంగా ఉంది. మరోవైపు, తమ నైపుణ్యాలకు తగిన స్థాయిలో జీతాలు రావడం లేదని 82 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ఉద్యోగులపై కుటుంబ బాధ్యతలు కూడా అధికంగానే ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది కనీసం ఒకరికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు. దాదాపు 32 శాతం కుటుంబాల్లో ఒక్కరే సంపాదించే వ్యక్తిగా ఉన్నారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అద్దె, రుణాల ఈఎంఐలు, కుటుంబ ఖర్చులకే నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చవుతుండటంతో దీర్ఘకాలిక పొదుపులకు అవకాశం తగ్గుతోంది.

రిటైర్మెంట్ ప్రణాళికలోనూ వెనుకబాటు
ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలో మరో ఆందోళనకర అంశం రిటైర్మెంట్. 34 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 92 శాతం మంది పదవీ విరమణ తర్వాతి జీవితానికి తగినంత ఆర్థికంగా సిద్ధంగా లేరని సర్వే వెల్లడించింది. 35 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనూ 77 శాతం మంది రిటైర్మెంట్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకోలేదని తేలింది. మరోవైపు, పెట్టుబడుల విషయంలో ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. అలాగే 69 శాతం మంది మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.

ఆరోగ్య బీమా, వైద్య ఖర్చులపై ఆందోళన
బీమా, వైద్య ఖర్చులు, తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఆర్థికంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదని 16 శాతం మంది తెలిపారు. వీరిలో 91 శాతం మంది వార్షిక ఆదాయం రూ.15 లక్షల కంటే తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. అత్యవసర పొదుపులు ఉన్నాయని 84 శాతం మంది చెప్పినప్పటికీ, రోజువారీ కుటుంబ ఖర్చుల కారణంగా ఆ మొత్తాలు త్వరగా ఖర్చయ్యే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. గ్రాంట్ థార్న్టన్ భారత్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ రిస్క్ అడ్వైజరీ పార్ట్‌నర్ రామ్‌కుమార్ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ఆర్థికంగా భద్రంగా ఉన్నామని భావించడం, అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం రెండూ వేర్వేరు విషయాలని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, కుటుంబ బాధ్యతలు, ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం వంటి అంశాలు ఉద్యోగులను ఆర్థికంగా బలహీనంగా మారుస్తున్నాయని వివరించారు. మొత్తంగా చూస్తే ఉద్యోగం, జీతం ఉన్నంతకాలం ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా.. అకస్మాత్తుగా ఆదాయం ఆగిపోతే చాలా కుటుంబాలు కష్టాల్లో పడే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. భారతీయులు అంటేనే పొదుపుకు పెట్టింది పేరుగా చెబుతారు.. మారుతున్న పరిస్థితులు.. పెరిగిపోతున్న ఖర్చులతో.. జీవితాన్ని లాగించడమే కష్టంగా మారిపోయి.. ఈ పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.