OYO: హాస్పిటాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రముఖ సంస్థ ‘ఓయో’ (OYO). త్వరలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ సంస్థ రాయల్ ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఓయో మాతృ సంస్థ ‘ప్రిజమ్’ (Prism) సుమారు రూ.6,650 కోట్ల భారీ ఐపీఓ (IPO) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) కి సవరించిన పత్రాలను సమర్పించింది. అయితే ఈ ఐపీఓ ద్వారా సేకరించే నిధులలో సింహభాగం (దాదాపు 75 శాతం) కంపెనీ తన పాత అప్పులను తీర్చడానికే ఉపయోగించనుండటం గమనార్హం. తమ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసి, అప్పుల్లేని సంస్థగా మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాలని ఓయో వ్యూహరచన చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఓ కాసులతో అప్పుల ఊబి నుంచి బయటపడేలా..
ప్రతిపాదిత రూ. 6,650 కోట్ల ఐపీఓ నిధులలో ఏకంగా రూ. 4,987.5 కోట్ల భారీ మొత్తాన్ని కేవలం పాత అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికే కంపెనీ కేటాయించనుంది. మిగిలిన నిధులను సంస్థ యొక్క సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తారు. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ తన అప్పులను తగ్గించుకుంటే అది ఆర్థిక స్థిరత్వానికి సూచికగా మారుతుంది. కాబట్టి, లిస్టింగ్ తర్వాత మార్కెట్లో ఓయో షేరు స్థిరంగా రాణించేందుకు ఈ ముందస్తు వ్యూహం ఎంతగానో దోహదపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓయో తీసుకువస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా ‘ఫ్రెష్ ఇష్యూ’ (కొత్త షేర్ల జారీ) రూపంలోనే రానుంది. అంటే ఆఫర్ ఫర్ సేల్ (OFS) విండో ద్వారా కంపెనీకి చెందిన ప్రస్తుత ప్రమోటర్లు గానీ, సాఫ్ట్‌బ్యాంక్ లాంటి పెద్ద ఇన్వెస్టర్లు గానీ తమ వాటాలను విక్రయించడం లేదు. అయితే, మార్కెట్ పరిస్థితులను బట్టి ఐపీఓ సైజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే సుమారు రూ.1,330 కోట్ల వరకు ‘ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్’ జరపాలని కంపెనీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ ప్లేస్‌మెంట్ సక్సెస్ అయితే, ఐపీఓ సైజ్ ఆ మేర తగ్గుతుంది.
లాభాల ట్రాక్‌లోకి ఓయో..
గత కొంతకాలంగా నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టిన ఓయో ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY26) మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ 2026) ప్రిజమ్ సంస్థ రూ.6,941 కోట్ల ఆదాయాన్ని (Operational Revenue) ఆర్జించింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో రూ. 748 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఆపరేటింగ్ స్థాయిలో కూడా కంపెనీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరం (FY25) లో కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ రెండింతల కంటే ఎక్కువగా పెరిగి రూ.953 కోట్ల నుంచి నేరుగా రూ. 2,127 కోట్లకు చేరింది. ఇందులో వన్-టైమ్ ఖర్చులు, షేర్-బేస్డ్ పేమెంట్స్ తీసివేసినప్పటికీ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.1,968 కోట్లుగా నమోదైంది. ఈ మెరుగైన ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఓయో ఐపీఓ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

