Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?

Oracle Mass Layoffs

Oracle Mass Layoffs

Oracle Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ముందంజలో ఉండేందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఏఐ డేటా సెంటర్ల విస్తరణ తెచ్చిపెడుతున్న భారీ ఖర్చులు ఇప్పుడు కంపెనీ జేబుకు పెద్ద కన్నమే పెడుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ కంపెనీల కోసం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుండటంతో ఒరాకిల్ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి, నగదు నిల్వలను కాపాడుకోవడానికి కంపెనీ లేఆఫ్స్ వైపు మొగ్గు చూపుతోంది. 2026 నాటికి తన రీస్ట్రక్చరింగ్ ప్రణాళికల వ్యయం ఏకంగా $2.8 బిలియన్లకు చేరుతుందని ఒరాకిల్ తాజాగా బ్లూమ్‌బెర్గ్‌ నివేదించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం ఉద్యోగాల తొలగింపునకు ఇచ్చే పరిహారం (సెవెరెన్స్ పే) కోసమే ఖర్చు కానుంది.

ఇప్పటికే ఈ ప్లాన్ కింద దాదాపు $2.1 బిలియన్ల ఖర్చు నమోదు కాగా, రాబోయే రోజుల్లో చేపట్టే అదనపు కోతల కోసం మరో $700 మిలియన్లను కేటాయించనుంది. నిధుల ఆదా కోసం ఈ ఏడాదే వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన ఒరాకిల్, త్వరలోనే మరొక విడత కోతలకు సిద్ధమవుతోందని బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది. గతేడాది మే నాటికి అమెరికాలో 49,000 మంది, ఇతర దేశాల్లో 92,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న ఈ సంస్థ, ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా 21,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవడం గమనార్హం.

మరోవైపు కంపెనీ చైర్మన్ లారీ ఎల్లిసన్‌కు సంబంధించిన ఒక కొత్త షేర్ ట్రేడింగ్ ప్లాన్ కూడా ఈ ఫైలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒరాకిల్‌లో దాదాపు 40% వాటా కలిగిన ఎల్లిసన్, జూన్ 22న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్ 24 నాటికి గరిష్టంగా 50 మిలియన్ షేర్లను విక్రయించవచ్చు. జూన్ 22న షేరు ధర $175.07 వద్ద ముగిసినప్పుడు ఈ వాటా విలువ దాదాపు $8.75 బిలియన్లుగా ఉంది. అయితే ఆ తర్వాత శుక్రవారం ముగింపు సమయానికి కంపెనీ షేర్లు 16% మేర క్షీణించాయి. వ్యాపారాల పరంగా చూస్తే లారీ ఎల్లిసన్ తన కుమారుడు డేవిడ్ ఎల్లిసన్ చేపట్టిన పలు భారీ డీల్స్‌కు ప్రధాన ఆర్థిక బలగంగా ఉన్నారు. గతేడాది పారామౌంట్ గ్లోబల్ టేకోవర్‌లోనూ, అలాగే డేవిడ్ నేతృత్వంలోని పారామౌంట్ స్కైడాన్స్ కార్ప్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కోసం ప్రతిపాదించిన $110 బిలియన్ల కొనుగోలు ఆఫర్‌లోనూ ఆయన ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. డేటా సెంటర్ల వ్యయం ఒరాకిల్ స్వల్పకాలిక మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నప్పటికీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో భారీగా వస్తున్న ఏఐ ఆర్డర్లు, ఆర్డర్ బ్యాక్‌లాగ్ నివేదికలు కంపెనీ షేర్లకు పెట్టుబడిదారుల నుంచి బలమైన మద్దతును అందిస్తున్నాయి.