Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?

Tomato And Onion

Tomato And Onion

Onion Price Hike: ఉల్లి లేని వంట లేదు.. ప్రతి కిచెన్‌లో.. ప్రతీ వంటకంలో ఉల్లి ఉండాల్సింది.. అంతలా మన భారతీయ వంటకాలతో ఉల్లికి లింక్‌ ఉంది.. అయితే, ఇప్పుడు ఉల్లిని కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది.. వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయల ధరలు మరోసారి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దేశంలోని పలు మార్కెట్లలో కిలో ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి కిలోను రూ.35కే విక్రయిస్తున్నప్పటికీ, ఆ ధరకు ఉల్లిపాయలు అన్ని మార్కెట్లలోనూ వినియోగదారులకు అందుబాటులోకి రావడం లేదు. బుధవారం రోజు అంటే సెప్టెంబర్‌ 16న దేశవ్యాప్తంగా ఉల్లిపాయల సగటు చిల్లర ధర కిలోకు రూ.53.84గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కిలో ధర రూ.27.71గా ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో ఉల్లిపాయల సగటు చిల్లర ధర దాదాపు 94 శాతం పెరిగింది. అదే రోజు సగటు టోకు ధర కిలోకు రూ.45.65గా నమోదైంది.

రూ.35కే ప్రభుత్వం అమ్ముతున్నా.. మార్కెట్‌లో రూ.60-70
ఉల్లి ధరల పెరుగుదలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఆగస్టు 24 నుంచి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద ఉన్న బఫర్ ఉల్లిపాయలను మార్కెట్‌లోకి విడుదల చేయడం ప్రారంభించింది. NCCF, NAFED, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తున్నారు. అయితే బఫర్ స్టాక్ నుంచి సరఫరా చేసిన ఉల్లిపాయలు ప్రతి మార్కెట్‌కు, ప్రతి వినియోగదారుడికి సమానంగా చేరకపోవడం సమస్యగా మారిపోయింది.. ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు బఫర్ ఉల్లిపాయలను తరలించడంలో రవాణా, పంపిణీ సవాళ్లు ఉన్నాయి. అందుకే ఒకవైపు ప్రభుత్వం రూ.35కే విక్రయిస్తుండగా, మరోవైపు సాధారణ వినియోగదారులు బహిరంగ మార్కెట్‌లో దాదాపు రెండింతల ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

19 నగరాలకు బఫర్ స్టాక్ సరఫరా
ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం బఫర్ స్టాక్ సరఫరాను 19 నగరాలకు విస్తరించింది. ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయలను తరలించేందుకు రైల్వే ర్యాక్‌లు, ‘కాండా ఎక్స్‌ప్రెస్’, 30కి పైగా ట్రక్కులను వినియోగిస్తోంది. నాసిక్ నుంచి పంపిన రైలు ర్యాక్‌ల ద్వారా ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలకు ఉల్లిపాయలు చేరాయి. కొన్ని మార్కెట్లలో బఫర్ ఉల్లిపాయల సరఫరాతో ధరలు తగ్గినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మరిన్ని మార్కెట్లలో కూడా ప్రభుత్వ ధరకు ఉల్లిపాయలు అందుబాటులోకి వస్తేనే సామాన్య వినియోగదారులకు మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది.

రబీ-ఖరీఫ్ మధ్య కాలం.. ధరలపై ఒత్తిడి
ఉల్లిపాయల ధరల పెరుగుదలకు కాలానుగుణ సరఫరా పరిస్థితులు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నాయి. రబీ సీజన్‌లో నిల్వ చేసిన ఉల్లిపాయలు క్రమంగా తగ్గిపోతుండగా, కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లకు చేరేందుకు కొంత సమయం పడుతుంది. ఈ రెండు పంటల మధ్య ఉండే కాలంలో సరఫరాపై ఒత్తిడి పెరగడం సాధారణంగా ఉల్లిపాయల ధరలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉండే ఈ కొరత కాలంలో బఫర్ నిల్వల నుంచి ఉల్లిపాయలను విడుదల చేస్తూ సరఫరాను పెంచే చర్యలు చేపడుతోంది. తాజా పరిస్థితుల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.

ఖరీఫ్ ఉల్లి సాగుపై ఆందోళనలు
ఈ ఏడాది ఖరీఫ్ ఉల్లిపాయల సాగు, కొత్త పంట రాకపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో విత్తనాలు వేయడం ఆలస్యమైనట్లు ప్రభుత్వం గతంలో పేర్కొంది. కర్ణాటకలోని చిత్రదుర్గ-చల్లకెరె ప్రాంతంలో కూడా సాగు సాధారణ స్థాయిలో కేవలం 60 శాతం మేరకు ఉందని అంచనాలు వెలువడ్డాయి. కొత్త పంట మార్కెట్‌కు ఆలస్యంగా వస్తే ఇప్పటికే తగ్గుతున్న రబీ నిల్వలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది. మరోవైపు.. ఉల్లిపాయల ధరలపై విత్తనాలు, నిల్వలు మాత్రమే కాకుండా వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. రుతుపవనాల పరిస్థితులు, వర్షాలు, పంట రాకలో మార్పులు సరఫరాను ప్రభావితం చేయవచ్చు. అదే సమయంలో కొంతమంది వ్యాపారుల ఊహాజనిత కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయని ప్రభుత్వం గతంలో పేర్కొంది.

ఉత్పత్తి సరిపోతున్నా.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
కానీ, దేశంలో ఉల్లిపాయల కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. 2024-25లో 30.767 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోలిస్తే, 2025-26లో ఉల్లిపాయల ఉత్పత్తి సుమారు 30.737 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో సమస్య కేవలం మొత్తం ఉత్పత్తి పరిమాణానికి సంబంధించినది మాత్రమే కాదని స్పష్టమవుతోంది. ఉల్లిపాయలు ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఎంత పరిమాణంలో మార్కెట్‌కు చేరుతున్నాయి, వాటి పంపిణీ ఎలా జరుగుతోంది అనే అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

1.21 లక్షల టన్నుల బఫర్ స్టాక్
2026-27 సంవత్సరానికి ప్రభుత్వం 2 లక్షల టన్నుల రబీ ఉల్లిపాయలను బఫర్ స్టాక్‌గా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సుమారు 1.21 లక్షల టన్నులను ఇప్పటికే సేకరించింది. బఫర్‌లోకి ఉల్లిపాయలను కొనుగోలు చేసే ధరను క్వింటాల్‌కు రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచింది. అంటే కిలోకు సుమారు రూ.21.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. కొరత కాలంలో మార్కెట్‌కు ఉల్లిపాయల సరఫరాను పెంచి, ధరలపై ఒత్తిడిని తగ్గించడమే ఈ బఫర్ స్టాక్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రభుత్వం బఫర్ ఉల్లిపాయలను రూ.35కు విక్రయిస్తూ సరఫరాను పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే బహిరంగ మార్కెట్‌లో ధరలు ఇంకా అధికంగానే ఉండటంతో, కొత్త ఖరీఫ్ పంట మార్కెట్‌కు చేరడం కీలకంగా మారింది.