Site icon NTV Telugu

Ola S1 Air: ఓలా మరో సంచలనం.. బడ్జెట్ ధరలోనే కొత్త మోడల్

Ola S1 Air Launched

Ola S1 Air Launched

Ola Launched Budget Oriented S1 Air Electric Scooter: ఎలక్ట్రిక్ బైక్ రంగంలో సరికొత్త సంచలనాలతో ఆశ్చర్యానికి గురి చేస్తోన్న ఓలా సంస్థ.. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో బాంబ్ పేల్చింది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు.. ఈసారి అత్యంత చౌక ధరకే ఒక కొత్త మోడల్‌ని రిలీజ్ చేసింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఓలా ఎస్1 ఎయిర్ పేరుతో కొత్త మోడల్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఓలా సంస్థ ఎస్1, ఎస్1ప్రో మోడళ్లను ఆవిష్కరించింది. తొలుత ఎస్1 ప్రో మోడల్‌ని విక్రయానికి తీసుకురాగా.. మొదట్లో అవి బాగానే అమ్ముడుపోయాయి. రానురాను విక్రయాలు తగ్గిపోవడంతో.. ఎస్1 స్కూటర్‌ని రూ. 99 వేల ధరకు మార్కెట్‌లోకి తెచ్చింది. ధర తగ్గించడం వల్ల విక్రయాలు పెరుగుతాయని ఆ సంస్థ భావించింది. కానీ, అది ఆ అంచనాల్ని అందుకోలేదు.

ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ధరలో తాజాగా ‘ఎస్1 ఎయిర్’ మోడల్‌ని ఓలా సంస్థ రంగంలోకి దింపింది. డిజైన్ పరంగా.. గత ఎస్1, ఎస్1 ప్రోతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. చూడ్డానికి ఆ పాత మోడళ్లనే ఇది పోలి ఉంది. సాఫ్ట్‌వేర్ కూడా ఒక్కటే. బ్యాటరీ కెపాసిటీలో మాత్రం మార్పులున్నాయి. బ్యాటరీ 2.5 కిలోవాట్ హవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మోటార్ 4.5 కిలోవాట్ పవర్‌తో వస్తుంది. ఒక్కసారి చార్జ్‌తో 101 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ కొత్త మోడల్ వెళ్తుందని ఓలా ప్రకటించింది. ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. 7 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 2.2 గిగాహెర్జ్ 8 కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, మ్యూజిక్ ప్లేబ్యాక్, నేవిగేషన్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అంటూ మూడు మోడ్‌లు ఉంటాయి. దీని వెనుక వెనుక బాడీ కలర్‌లో డ్యుయల్ టోన్‌తో స్వల్ప మార్పు చేశారు.

సున్నా నుంచి 100 శాతం చార్జింగ్ అవ్వడానికి.. ఈ ఓలా ఎస్1 ఎయిస్ సుమారు 4.5 గంటల సమయం తీసుకుంటుందని ఓలా సంస్థ తెలిపింది. రూ.999 చెల్లించి.. కస్టమర్లు ఈ కొత్త స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ కొత్త మోడళ్ల కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ నుంచి డెలివరీ చేస్తారు. తొలుత దీని ధరను రూ. 79,999గా కేటాయించిన ఓలా సంస్థ.. ఆ తర్వాత రూ.85 వేలకు పెంచనుంది. మరి, ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఎలాంటి విప్లవాలు తీసుకొస్తుందో చూడాలి. పెట్రోల్ స్కూటర్ యాక్టివాకు గట్టిపోటీ ఇవ్వడమే తమ ఉద్దేశ్యమని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. మరి, దానికి ఇది పోటీ ఇవ్వగలదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version