New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్..

Irctc

Irctc

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, జూలై 15, 2026 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక బృందంగా వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత IRCTC ప్లాట్‌ఫామ్‌పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం, గందరగోళంగా ఉండే క్యాప్చా సిస్టమ్, పాతబడిన డిజైన్, టికెట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేవలం 30 రోజుల గడువులోగా సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూలై 15 కల్లా ఈ కొత్త ప్లాట్‌ఫామ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వీటిలో సులభంగా అర్థమయ్యే ఇంటర్‌ఫేస్, వేగవంతమైన బుకింగ్ విధానం ఇందులో ఉండనున్నాయి.

×
×
Ad

దీనితో పాటు, 1986 నాటి పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను కూడా ఇండియన్ రైల్వేస్ పూర్తిగా మార్చబోతోంది. ఆగస్టు 2026 నాటికి కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. రైల్వే టికెటింగ్ సేవలను ఆధునీకరించడం, బుకింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రక్రియను వేగవంతం చేయడం దీని లక్ష్యం. ఇండియన్ రైల్వేస్ 2002లో ఆన్‌లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో కౌంటర్ల కంటే ఆన్‌లైన్ బుకింగ్స్‌ విపరీతంగా పెరిగాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మార్పులు కోట్లాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.