Site icon NTV Telugu

Reliance Industries: రిలయన్స్‌లో కొత్త నాయకత్వం.. ఆయిల్ అనంత్‌కు, రిటైల్ ఇషాకు..!!

Reliance Industries

Reliance Industries

Reliance Industries: ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలయన్స్ కంపెనీల బాధ్యతలను వారసులకు అప్పగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదే నాయకత్వ బదలాయింపు ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించగా.. తాజాగా నాయకత్వ బదలాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. అటు చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రిలయన్స్ గ్రూప్ ఇంధన వ్యాపార బాధ్యతలను అప్పగించారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ బిజినెస్‌ను కుమార్తె ఇషా అంబానీకి అప్పగిస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు.

Read Also: FaKe Engine Oil Gang Busted: నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ గ్యాంగ్ గుట్టురట్టు

తాను ఇప్పట్లో వ్యాపార రంగం నుంచి తప్పుకోబోనని, రిటైర్మెంట్ ఆలోచనే లేదని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ ఇప్పటికే తమ బాధ్యతల్లో కొనసాగుతున్నారని, తాజాగా తమ గ్రూప్‌లోకి అనంత్ అంబానీని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ మూడు విభాగాలు సమానమేనని, రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ ఆలోచనల నుంచి పుట్టినవేనని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. కాగా ఇటీవల దుబాయ్‌లో అత్యంత విలువైన విల్లాను ముఖేష్ అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సముద్రానికి అత్యంత సమీపంలో, ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం కలిగిన విల్లాను ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీని విలువ 80 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.640 కోట్లుగా సమాచారం అందుతోంది.

Exit mobile version