ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్ సహా పలు దేశాల్లో ఔట్‌లుక్, ఎంఎస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సేవలు బుధవారం పనిచేయడం లేదు. దీంతో వేలాది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ దర్యాప్తు చేపట్టింది. అయితే ఎంతమంది యూజర్లపై దీని ప్రభావం పడిందనేది సంస్థ వెల్లడించలేదు. సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో యూజర్లు ఫిర్యాదులు చేస్తుండటంతో ఉపశమన చర్యలకు పూనుకుంది సంస్థ.
భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, దేశాల్లో మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో అంతరాయం కలిగింది. ఔట్ లుక్ వెబ్‌సైట్ రీఫ్రెష్ అవడం లేదని, ఈ-మెయిల్స్ రావడం లేదని పలువురు యూజర్లు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్ పనిచేయడం లేదని భారత్‌లో ఇప్పటివరకు చాలా మంది యూజర్లు ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్.కామ్ వెబ్‌సైట్ వెల్లడించింది. జపాన్‌లోనూ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. టీమ్స్ నుంచి కాల్స్, మెసేజ్‌లు చేయలేకపోతున్నామని పలువురు ట్వీట్లు చేస్తున్నారు.దీనిపై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ స్పందించింది. సమస్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌కు 28 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.