అగ్రదేశం అమెరికాలో క్రికెట్ ప్రేమికులు క్రమంగా పెరుగుతున్నారు. దీంతో అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్ పోటీలకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తోంది. మరోవైపు అమెరికాలో ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ నిర్వహించబోతున్నారు. దీనికి మేజర్ క్రికెట్ లీగ్ అని నామకరణం కూడా చేశారు. ఈ లీగ్ కోసం 120 మిలియన్ డాలర్లు సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 44 మిలియన్ డాలర్లను పోగుచేశారు. మిగిలిన 12 నెలల్లో 76 మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సొమ్ముతో అమెరికాలో భారీ క్రికెట్ స్టేడియాలు నిర్మించనున్నారు.
అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్రికెట్‌పై మోజు పడుతున్నారు. అమెరికాలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభించే మేజర్ లీగ్ క్రికెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిర్వాహకులు సేకరించిన 44 మిలియన్ డాలర్లలో సత్య నాదెళ్ల కీలక పెట్టుబడులు పెట్టారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. తాను భారత్‌లో పుట్టి పెరగడం వల్ల క్రికెట్ అనేది అభిరుచుల్లో ఒకటిగా మారిందని తెలిపారు. అంతేకాదు క్రికెట్ ఆడడం వల్ల అందులోని పోటీతత్వం, సమష్టితత్వం వల్ల బృందాలతో ఎలా పనిచేయాలో తెలుస్తుందన్నారు. క్రికెట్ వల్ల నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌లోని పరిస్థితులనే తన కెరీర్‌కు కూడా వర్తింపజేస్తానని, ఇప్పటిదాకా తాను ఆ సూత్రాలనే పాటించానని సత్య నాదెళ్ల వివరించారు.
