Gold Sale Income Tax: తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొన్న వ్యక్తికి రూ.60 లక్షల ట్యాక్స్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?

Income Tax

Income Tax

Gold Sale Income Tax: తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మల నుంచి వారసత్వంగా వచ్చిన బంగారాన్ని అమ్మి సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయంలో ఆదాయపు పన్ను నిబంధనలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎప్పుడు వచ్చింది? ఎంత ధరకు అమ్మారు? వచ్చిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టారు? వంటి వివరాలకు సరైన ఆధారాలు లేకపోతే పన్ను సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ముంబైలోని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ముందు విచారణకు వచ్చిన ఓ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు, అమ్మమ్మ నుంచి వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయించి ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఏకంగా రూ.60.08 లక్షల మేర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పెరిగింది. ఈ కేసులో తాజాగా ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది.

అసలు ఏం జరిగింది?

ఈ కేసు 2016-17 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించినది. సదరు వ్యక్తి తన తండ్రి నుంచి 968 గ్రాముల బంగారం, తల్లి నుంచి మరో 310 గ్రాముల బంగారం అందుకున్నట్లు ఆదాయపు పన్ను అధికారులకు తెలిపాడు. అంతేకాకుండా తన అమ్మమ్మ వీలునామా ద్వారా కూడా కొంత బంగారం వారసత్వంగా వచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ బంగారాన్ని విక్రయించి వచ్చిన మొత్తాన్ని నివాస గృహం కొనుగోలు చేసేందుకు పెట్టుబడిగా పెట్టినట్లు వివరించాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 54F కింద రూ.34.39 లక్షల పన్ను మినహాయింపును కోరాడు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి బహుమతిగా లేదా వారసత్వంగా బంగారం వచ్చినట్లు నిరూపించేందుకు తగిన డాక్యుమెంట్లు సమర్పించలేదని ఆదాయపు పన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అతడి పన్ను మినహాయింపు అభ్యర్థనను తిరస్కరించింది.

బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్లపైనా అనుమానం

ఇదే సమయంలో అతడి బ్యాంకు ఖాతాల్లో జరిగిన నగదు డిపాజిట్లపైనా ఆదాయపు పన్ను అధికారులు ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం రూ.25,68,850 నగదు డిపాజిట్లకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వాటిని వివరించని ఆదాయంగా పరిగణించారు. ఇందులో..

పన్ను చెల్లింపుదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం: రూ.9,36,200
అతడి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసిన మొత్తం: రూ.16,32,650

ఈ నగదు తనకు తెలిసిన ఆదాయం, గతంలో కూడబెట్టిన పొదుపు, చట్టబద్ధమైన ఇతర మార్గాల నుంచి వచ్చిందని అతడు వాదించాడు. తన భార్యకు కూడా ప్రత్యేక ఆదాయం, పొదుపులు ఉన్నాయని, ఆమె ఖాతాలోని డబ్బు ఆమెకే చెందుతుందని వివరించాడు. అయితే అధికారులు ఈ వివరణలను అంగీకరించలేదు. దీంతో సెక్షన్ 54F కింద కోరిన రూ.34.39 లక్షల మినహాయింపుతో పాటు రూ.25.69 లక్షల నగదు డిపాజిట్లను కలిపి సుమారు రూ.60.08 లక్షల మేర ఆదాయానికి అదనపు పన్ను లెక్కలు వేశారు.

పన్ను చెల్లింపుదారుడికి మరో అవకాశం ఇచ్చిన ITAT

ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT), ముంబై విచారణ చేపట్టింది. కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (అప్పీల్స్), నేషనల్ ఫేస్‌లెస్ అప్పీల్ సెంటర్ ఈ కేసును నిర్ణయించే ముందు అదనపు వివరాలు, ఆధారాలు సమర్పించేందుకు కొత్తగా నోటీసు ఇవ్వలేదని ట్రిబ్యునల్ గమనించింది. దీంతో కేసును తిరిగి అసెస్సింగ్ ఆఫీసర్ వద్దకు పంపించింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి, పన్ను చెల్లింపుదారుడి వాదనలను మరోసారి పరిశీలించాలని ఆదేశించింది.

అయితే, ట్రిబ్యునల్ ప్రస్తుతం అతడు కోరిన రూ.34.39 లక్షల పన్ను మినహాయింపును మంజూరు చేయలేదు. అలాగే నగదు డిపాజిట్లకు సంబంధించిన వివరణలను కూడా ఆమోదించలేదు. కేవలం మరోసారి విచారణ జరిపేందుకు అవకాశం కల్పించింది. అందుకే అప్పీల్‌ను స్టాటిస్టికల్ ప్రయోజనాల కోసం అనుమతించింది.

సెక్షన్ 54F కింద పన్ను మినహాయింపు ఎలా లభిస్తుంది?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54F ప్రకారం, నిర్దిష్ట ఆస్తులను విక్రయించి వచ్చిన మొత్తాన్ని అర్హత కలిగిన నివాస గృహంలో పెట్టుబడిగా పెడితే కొన్ని షరతులకు లోబడి దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ వివాదంపై జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. సెక్షన్ 54F కింద మినహాయింపు లెక్కింపు కేవలం వచ్చిన లాభంపై మాత్రమే ఆధారపడదని వివరించారు. బంగారం విక్రయం ద్వారా వచ్చిన నికర మొత్తంలో ఎంత భాగాన్ని అర్హత కలిగిన ఇంటి కొనుగోలుకు పెట్టుబడిగా పెట్టారనే అంశం ఆధారంగా మినహాయింపు లెక్కిస్తారని తెలిపారు.

ఒక ఉదాహరణతో చూద్దాం..

ఒక వ్యక్తి తన బంగారాన్ని విక్రయించడం ద్వారా రూ.40 లక్షలు పొందాడని అనుకుందాం. అందులో దీర్ఘకాలిక మూలధన లాభం రూ.15 లక్షలు ఉందనుకుందాం. అతడు అర్హత కలిగిన ఇంటి కొనుగోలుకు రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే.. మొత్తం నికర విక్రయ విలువలో 75 శాతం పెట్టుబడి పెట్టినట్లవుతుంది. అప్పుడు రూ.15 లక్షల లాభంలో 75 శాతం అంటే రూ.11.25 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన రూ.3.75 లక్షలపై పన్ను వర్తిస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద అదనపు అర్హత కలిగిన డిపాజిట్ లేనట్లయితే ఈ లెక్క వర్తిస్తుంది.

వారసత్వంగా వచ్చిన బంగారంపై పన్ను ఉంటుందా?

తల్లిదండ్రులు లేదా తాతయ్యలు, అమ్మమ్మల నుంచి వారసత్వంగా వచ్చిన బంగారాన్ని స్వీకరించినప్పుడు సాధారణంగా దానిపై పన్ను విధించరు. అయితే, ఆ బంగారాన్ని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) వర్తించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వారసత్వంగా వచ్చిన బంగారం విక్రయించినప్పుడు గత యజమాని కొనుగోలు చేసిన ధరను, అలాగే ఆయన కొనుగోలు చేసినప్పటి నుంచి ఉన్న హోల్డింగ్ పీరియడ్‌ను సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల బంగారం ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎంత ధరకు కొనుగోలు చేశారు? ఎప్పుడు వారసత్వంగా వచ్చింది? ఎప్పుడు విక్రయించారు? అనే వివరాలు పన్ను లెక్కింపులో కీలకంగా ఉంటాయి.

బంగారం అమ్మి ఇల్లు కొనేవారు ఈ డాక్యుమెంట్లు భద్రపరచుకోవాలి

వారసత్వంగా వచ్చిన లేదా బహుమతిగా అందుకున్న బంగారాన్ని విక్రయించి ఇల్లు కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలు కింది పత్రాలను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

గిఫ్ట్ డిక్లరేషన్: తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు బంగారం బహుమతిగా ఇచ్చినట్లు ఆధారాలు.
వారసత్వ పత్రాలు: వీలునామా, వారసత్వానికి సంబంధించిన ఇతర చట్టపరమైన పత్రాలు.
బంగారం విలువ నిర్ధారణ నివేదిక: బంగారం బరువు, విలువకు సంబంధించిన వివరాలు.
బంగారం విక్రయ రసీదులు: ఎప్పుడు, ఎంత మొత్తానికి విక్రయించారో తెలిపే ఇన్వాయిస్‌లు.
బ్యాంక్ స్టేట్‌మెంట్లు: బంగారం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు బ్యాంకులో జమ అయినట్లు ఆధారాలు.
క్యాష్ ఫ్లో డీటెయిల్స్: డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఖర్చు చేశారు? అనే వివరాలు.

పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం

తల్లిదండ్రుల నుంచి బంగారం రావడం, దానిని అమ్మి ఇల్లు కొనడం చట్టవిరుద్ధం కాదు. అయితే ఆ బంగారం మూలం, యాజమాన్యం, విక్రయ విలువ, వచ్చిన డబ్బు వినియోగం వంటి అంశాలను సరైన పత్రాలతో నిరూపించగలగాలి. కేవలం బంగారం అమ్మి ఇల్లు కొనుగోలు చేశామని చెప్పడం మాత్రమే సరిపోదు. తగిన ఆధారాలు లేకపోతే పన్ను మినహాయింపులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో బంగారం విక్రయించే ముందు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా పన్ను నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.