Site icon NTV Telugu

SEBI: సెబీ ఛైర్‌పర్సన్ మాధబికి ఊరట.. ఆరోపణలపై కేంద్రం క్లీన్‌చిట్!

Madhabipuribuch

Madhabipuribuch

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) చైర్‌పర్సన్‌ మాధబి పూరీ బుచ్‌కి ఊరట లభించింది. అనుచిత ఆరోపణలపై మాధబికి కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కేంద్రం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని పేర్కొంది. సెబీ చీఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాల పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశంలో రచ్చ.. ఎంపీ చేతికి గాయం!

సెబీ చీఫ్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన దర్యాప్తు ముగిసింది. అయితే మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు వర్గాలు చెప్పినట్లు సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: 15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్‌ చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం అందుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను మాధబి కొట్టిపారేశారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ananya Nagalla : అందం, అభినయం ఉన్నా అనన్యకు అలాంటి అవకాశాలే ఎందుకు వస్తున్నాయి ?

Exit mobile version