NTV Telugu Site icon

మళ్లీ షాక్.. వంట గ్యాస్‌పై వడ్డింపు.. సబ్సిడీ కూడా కట్..!

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచేశారు. నెలల రోజుల వ్యవధిలోనే ప్రజలపై వందల రూపాయల భారాన్ని మోపారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక, సిలిండర్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తి ఈ మొత్తం చెల్లిస్తే సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడేది. కానీ, ప్రస్తుతం సబ్సిడీ నగదు కూడా జమ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత  హైదరాబాద్‌లో వినియోగదారులు సిలిండర్‌కు 771.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర 746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర 664  నుంచి 719 రూపాయలకి పెరిగింది. కోల్‌కతాలో 745.50, ముంబైలో 719, చెన్నైలో 735 రూపాయలకి చేరింది. 


రాయితీ సిలిండర్‌ లను కూడా త్వరలోనే ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. ఇది అమలైతే వినియోగదారులపై భారం పడనుంది. సిలిండర్‌ బుక్‌ చేసుకున్న తేదీతో సంబంధం లేకుండా డెలివరీ చేసిన రోజునే ప్రాతిపదికగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీగా వేల గ్యాస్‌ సిలిండర్ల వరకు వినియోగం ఉంటుంది. ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం పెరిగిన 25 రూపాయలు అదనపు భారం పడింది. ఈ లెక్కన రోజువారీ కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రజల పై మోపారు. ఇక, గ్యాస్‌ సిలిండర్‌ గతంలో సబ్సిడీ మినహాయించి వినియోగదారుల నుంచి ధర వసూలు చేసే వారు. అప్పట్లో 500లోపే సిలిండర్‌ ధర ఉండేది. తర్వాత ధర పెరిగినా పెంచిన మొత్తం ధర వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందకంటే గ్యాస్‌ సిలిండర్‌ అసలు ధరే 746 రూపాయలు ఉంది. ఈ నెలలో పెంచిన ధరల ప్రకారం 771 చెల్లిస్తే.. సబ్సిడీ మొత్తం తిరిగి వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమకావాలి. ఇప్పటి వరకు ఈ మొత్తం సొమ్ము జమ కావడం లేదు. అసలు సబ్సిడీ మినహాయించి గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో కూడా తెలియడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే అసలు గ్యాస్‌ సిలిండర్‌ ఏ విధంగా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రాష్ట్రం విధించే వ్యాట్‌ తగ్గించుకుంటే ఇంతగా పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ఇప్పటికే  నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని, ఈ సమయంలో గ్యాస్‌ ధరలు పెంచటం ఎంత వరకు సమంజసమని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.