NTV Telugu Site icon

Life Insurance Corporation: ఎల్ఐసీకి ఏమైంది?. 1.21 లక్షల కోట్లు కోల్పోయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

Lic

Lic

Life Insurance Corporation: మన దేశంలో ఎల్‌ఐసీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయ జీవిత బీమా సంస్థ(లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఎల్‌ఐసీ) అంటే ప్రతిఒక్కరికీ భరోసా. జీవితంపై ధీమా. ఎల్‌ఐసీలో బీమా తీసుకుంటే ఆ కుటుంబం ఇక ఆందోళన చెందక్కర్లేదనే విశ్వాసం ఉండేది. కానీ ఆ గుడ్‌విల్‌ క్రమంగా పడిపోతోంది. ఇటీవలి కాలంలో ఎల్‌ఐసీ తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లటం కరెక్ట్‌ కాదనే అభిప్రాయాలు మొదట్లోనే వ్యక్తం కాగా అవి ఇప్పుడు గణాంకాలతో సహా రుజువవుతున్నాయి.

ఎందుకంటే ఆ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 1.21 లక్షల కోట్ల రూపాయల విలువ కోల్పోయింది. ఎల్‌ఐసీ షేర్‌ వ్యాల్యూ 22 శాతం పడిపోయింది. షేర్‌ మార్కెట్ సెంటిమెంట్‌ ఘోరంగా దెబ్బతినటంతో ఆ ప్రభావం ఎల్‌ఐసీ మీద కూడా భారీగా పడింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ గతంలో టాప్‌-10 కంపెనీల లిస్టులో ఐదో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు 9వ ప్లేస్‌కి దిగొచ్చింది. దీన్నిబట్టి ఈ ర్యాంక్‌ సమీప భవిష్యత్తులో ఇంకా దిగజారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వెలువడుతున్నాయి.

Hyderabad Public School: రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కి 50 ఏళ్లు. రేపు వేడుకలు.

మొత్తం ఈక్విటీ మార్కెట్‌లో ఈ సంస్థకు 4 శాతం వాటా ఉంది. బాండ్‌ మార్కెట్‌లో 2 శాతం షేర్‌ ఎల్‌ఐసీ సొంతం. కాబట్టి స్టాక్‌ మార్కెట్‌ లేదా బాండ్‌ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న ప్రతిసారీ ఈ సంస్థ విలువ క్రమంగా పతనమవుతూనే ఉంటుంది. ఎల్‌ఐసీ తొలిసారిగా ఈ ఏడాది మే నెలలో స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. మూడు నెలల్లోనే ఈ సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1.21 లక్షల కోట్ల రూపాయలు తగ్గి ప్రస్తుతం 4.26 లక్షల కోట్ల వద్ద ఉంది. ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లి చెత్త పనితీరు కనబరిచిన టాప్‌-3 స్టాక్స్‌లో ఎల్‌ఐసీవీ కూడా ఉండటం విచారించాల్సిన విషయం.

ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఇక అత్యంత విలువైన టాప్‌-5 కంపెనీల జాబితాలో తిరిగి స్థానం పొందే సూచనలు లేవని నిపుణులు అంటున్నారు. గతంలో ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వ్యాల్యూ రూ.5.41 లక్షల కోట్లు ఉండేది. కానీ అదిప్పుడు చాలా కోల్పోయింది. ఈ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదైన కొత్తలో భారీగా హైప్‌ క్రియేట్‌ అయింది. ఎప్పుడైతే మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నదో ఎల్‌ఐసీ ఇమేజ్‌ సైతం మసకబారటం మొదలైందనే వ్యాఖ్యానాలు వినిపించసాగాయి. షేర్‌ వ్యాల్యూ 22 శాతం తగ్గింది. సెన్సెక్స్‌లో దాదాపు 6 శాతం పడిపోయింది.

ఒకప్పుడు దేశంలోని మొత్తం ఇన్సూరెన్స్‌ పాలసీల్లో సగానికి పైగా ఎల్‌ఐసీవే ఉండేవి. దీంతో ప్రీమియం సొమ్ములు పెద్దమొత్తంలో రాగానే వాటిని వివిధ రూపాల్లో పెట్టుబడులుగా మార్చేది. ముఖ్యంగా డెబ్ట్‌ లేదా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసేది. కానీ ఇప్పుడు ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు ఎల్‌ఐసీ కన్నా ఎక్కువ లాభాలను ఇన్వెస్టర్లకు ఇస్తున్నాయని కొందరు అనలిస్టులు అంటున్నారు. ఎల్‌ఐసీ పట్ల విశ్వాసం ఉందని ఒకపక్క చెబుతూనే మరోపక్క రిటర్న్స్‌ విషయంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలే బెటర్‌ అని చెబుతున్నారు.

వాస్తవానికి ఈ సంస్థ గత దశాబ్ద కాలంగా మార్కెట్‌ షేర్‌ని ప్రైవేట్‌ సంస్థలకు కోల్పోయిందని చెప్పొచ్చు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పాలసీలతోపాటు ఇతర ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్‌ల విషయంలో గానీ కొత్త డిస్ట్రిబ్యూషన్‌ ఛానల్స్‌ విషయంలో గానీ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు వ్యవహరించినంత వేగంగా ఎల్‌ఐసీలో చురుకుదనం కనపించట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌ఐసీ వర్గాలు మాత్రం ఈ కామెంట్స్‌ని కొట్టిపారేస్తున్నాయి. సంస్థ మార్కెట్‌ విలువకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.