సెల్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రిలయన్స్ జియో-గూగుల్ కలిసి రూపొందిస్తున్న జియో ఫోన్ ‘నెక్స్ట్’ లాంచింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ ఫోన్‌ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పారు. జియోతో పాటు గూగుల్ తయారుచేసిన ఈ ఫోన్‌లో ఫోన్‌కాల్‌ను అనువదించే ట్రాన్స్‌లేషన్ టూల్‌ను ఏర్పాటు చేశారు.
Read Also: ఆయన ఆదాయం సెకనుకు రూ.3 కోట్లు
‘జియో ఫోన్ నెక్ట్స్ అనేది భారతదేశంలో తయారైంది. భారతదేశం కోసం తయారైంది. భారతీయులచే తయారుచేయబడింది. డిజిటల్ సాంకేతికతకు ప్రతీ భారతీయుడు కూడా సమాన అవకాశాలు, సమాన యాక్సెస్ పొందేలా జియో ఫోన్ నెక్ట్స్ చేస్తుంది. కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చేలా జియో ఫోన్ నెక్ట్స్ ఉంటుంది’ అంటూ జియో సంస్థ ప్రచారం చేసుకుంటోంది. వాయిస్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్, ట్రాన్స్ లేట్, నైట్ మోడ్‌తో ఫోటోలు తీయడం, సులభమైన స్మార్ట్ కెమెరా వంటి ఎన్నో ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతగా జియో పేర్కొంది. ఈ ఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువ కాలం వస్తుందని, అంతేకాకుండా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు ఈ ఫోన్ అప్‌డేట్ అయిపోతుందని వివరించింది.
