ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు శనివారం భారీ ఉపశమనాన్ని కలిగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత నిధులను ఆయన అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా జరిగిన ‘పశ్చిమ బంగ దివస్’ వేడుకల నుంచి ప్రధానమంత్రి బటన్ నొక్కి, దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000లను అందిస్తోంది.
రాష్ట్రాల్లో వేడుకలు..
ఈ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ‘పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ) లేని రైతులకు కూడా ఈ విడతలో ఊరట లభించింది. యూపీలోని 2.17 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,352 కోట్లు జమ కానున్నాయి. అయితే, ఐడీలు లేకపోవడం వల్ల యూపీలో దాదాపు 50 లక్షల మందికి, బీహార్‌లో 34 వేల మందికి పైగా రైతుల పేర్లు జాబితా నుండి తొలగించినట్లు తెలుస్తోంది. బీహార్‌లో గత విడతలో 73.34 లక్షల మంది ప్రయోజనం పొందారు.
డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?
ఖాతాల్లో జమ అయిన రూ. 2,000 నగదును రైతులు సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. డిజీపే (DigiPay) లేదా డిజీపే లైట్ (DigiPayLite) ద్వారా, లేదా తమకు దగ్గరలోని ఎఫ్‌పీఓ (FPO), పీఏసీఎస్ (PACS) కేంద్రాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
స్టేటస్ చెక్ చేసుకునే విధానం..
రైతులు తమ ఖాతాలోకి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ‘pmkisan.gov.in’ పోర్టల్‌లోకి వెళ్లి ‘Know Your Status’ పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

