Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కసారి ఊహించుకోండి…! ఇంజినీర్లు.. డాక్టర్లు.. ఏఐ నిపుణులు.. ఒక్కరేంటి.. అన్ని రంగాలకు చెందిన నిపుణులు మనకు పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటారు… కానీ ఇంట్లో పైపు పగిలితే బాగు చేయడానికి ప్లంబర్ దొరకడు. కరెంటు పోతే ఎలక్ట్రీషియన్ దొరకడు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది..? రానున్న ఐదేళ్లలో మన దేశం ఈ తరహా సంక్షోభాన్నే చూడబోతోంది. ప్రపంచ లేబర్ మార్కెట్లలో రాబోతున్న మహా తుఫాను.. మన దేశంలో ఈ తరహా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగించబోతోంది.
మ్యాక్రో ట్రెండ్స్ రీసెర్చ్ సంస్థ ఏం చెబుతోంది?
ఇండియాలో మరో ఐదేళ్లలో ప్లంబర్లు… ఎలక్ట్రీషియన్లు.. కార్పెంటర్లు.. డ్రైవర్లు.. నర్సులు.. కేర్ టేకర్స్ కొరత ఏర్పడబోతోంది. కెనడాకు చెందిన మ్యాక్రో ట్రెండ్స్ రీసెర్చ్ సంస్థ- పైన్‌ట్రీ అంచనా ఇది. ప్రపంచవ్యాప్తంగా బ్లూ కాలర్ వర్కర్ల కొరత తీవ్రంగా ఉందని ఈ సంస్థ చెబుతోంది. భారత్ నుంచి ఇలాంటి నైపుణ్యం ఉన్న కార్మికులను అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోబోతున్నాయని పైన్‌ట్రీ వ్యవస్థాపకుడు రితేష్ జైన్ చెబుతున్నారు. వైట్ కాలర్ వర్కర్లు ప్రపంచానికి సరిపడా ఉన్నా.. శారీరక శ్రమ చేసే బ్లూ కాలర్ వర్కర్ల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో రానున్న ఐదేళ్లలో ఈ తరహా నైపుణ్యం ఉన్న వర్కర్లు దొరక్క భారతీయులు ఇబ్బంది పడక తప్పదు.
Also Read
- Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్‌లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
వృద్ధాప్య జనాభా పెరుగుదలే కారణమా?
ఈ విపత్కర పరిస్థితికి ప్రధాన కారణం అభివృద్ధి చెందిన దేశాల్లోని జనాభా ముసలివాళ్లుగా మారిపోవడమే. ఐరోపా దేశాలతో పాటు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఈ వృద్ధాప్య జనాభా సమస్యతో పోరాడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాల ప్రకారం 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. 2070 నాటికి ఈ సంఖ్య మరోసారి రెట్టింపు కాబోతోంది. యూఎన్ పాపులేషన్ ఫండ్ లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 60 శాతం మంది రిప్లేస్మెంట్ రేటు కంటే తక్కువ సంతానోత్పత్తి ఉన్న దేశాల్లోనే నివసిస్తున్నారు. అంటే పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగానే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలను నడిపించే శ్రామిక శక్తి దొరకడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్నప్పటికీ నిర్మాణ రంగ కార్మికులు.. మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్ లు దొరకడం గగనంగా మారింది. 2023 నాటికి యూరోపియన్ యూనియన్ పరిధిలోని దాదాపు 75 శాతం కంపెనీలు సరైన నైపుణ్యాలున్న కార్మికులను కనుగొనడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల క్రితం ఉన్న పరిస్థితితో పోలిస్తే ఈ కొరత రెట్టింపు అయిందని యూరోఫౌండ్ సర్వేలు చెబుతున్నాయి. జర్మనీలో అయితే 2024లో 80 శాతానికి పైగా యజమానులు కార్మికులను నియమించుకోవడంలో కష్టాలు పడుతున్నట్లు డేటా స్పష్టం చేస్తోంది. ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, మెకానిక్ లు యూరోపియన్ యూనియన్ లో అత్యంత డిమాండ్ ఉన్న వృత్తుల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అమెరికాలో కూడా రాబోయే కొద్ది సంవత్సరాల్లో లక్షలాది మంది ప్లంబర్ల కొరత ఏర్పడనుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.
ఇన్నాళ్లు పాశ్చాత్య దేశాలు వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. వలస వచ్చిన వారు స్థానిక సంస్కృతిలో కలిసిపోకపోవడంతో పాటు ఆ దేశ సంస్కృతినే మార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు అక్కడ పెరుగుతున్నాయి. దీంతో రాజకీయంగానూ వలస విధానాలపై వ్యతిరేకత వస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. అయితే వ్యాపార సంస్థలు మాత్రం కార్మికులు కావాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. అందుకే ఇకపై గుడ్డిగా వలసలను అనుమతించకుండా కేవలం తమకు అవసరమైన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, నర్సులకు మాత్రమే టార్గెటెడ్ వీసాలు ఇవ్వాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే స్కిల్డ్ వర్కర్లను సరఫరా చేయడంలో భారత్ కేంద్ర బిందువు కానుంది.
ఒకవైపు విదేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఇంత డిమాండ్ ఉంటే.. మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. లక్షలాది మంది యువత డిగ్రీలు చేతపట్టుకుని అప్పటికే రద్దీగా ఉన్న వైట్ కాలర్ జాబ్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా సిరీస్ నివేదికల ప్రకారం… గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతలో నిరుద్యోగ రేటు దాదాపు 40 శాతంగా ఉంది. లేబర్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్న ప్రతి పద్నాలుగు మంది గ్రాడ్యుయేట్లలో కేవలం ఒక్కరు మాత్రమే శాశ్వత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. మరోవైపు పరిశ్రమలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలున్న బ్లూ కాలర్ వర్కర్ల కొరత భారత్ లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. పనులు ఉన్నా వాటిని చేసే నైపుణ్యం ఉన్నవారు దొరకడం లేదు.
ఇండియాలో బ్లూ కాలర్ ఉద్యోగాలు అసంఘటిత రంగంలో ఉండటం… తక్కువ వేతనాలు రావడం.. భద్రత లేకపోవడం వల్ల యువత వీటి వైపు ఆకర్షితులు కావడం లేదు. వచ్చే పదేళ్లలో లాజిస్టిక్స్.. నిర్మాణం.. తయారీ రంగాల్లోనే ఎక్కువగా కొత్త ఉద్యోగాలు రానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రితేష్ జైన్ హెచ్చరిస్తున్నట్లు మరో ఐదేళ్లలో మన దేశంలోని నైపుణ్యం ఉన్న బ్లూ కాలర్ వర్కర్లంతా భారీ ప్యాకేజీలకు ఆకర్షితులై విదేశాలకు వలస వెళ్లిపోవడం ఖాయం. అదే జరిగితే మన ఇంట్లో కరెంటు పోయినా.. పైపు పగిలినా బాగు చేసే నాథుడే దొరకడు. చేతిలో పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి ఉద్యోగాలు లేని యువత మాత్రమే ఇక్కడ మిగులుతారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వృత్తి నైపుణ్యాలకు తగిన గుర్తింపు.. గౌరవం.. వేతనం ఇస్తేనే మన దేశానికి ఈ ముప్పు తప్పుతుంది.
:ఫణి కుమార్ (NTV DIGITAL)
- Tags
- AI
- Explainers in Telugu
- Jobs
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!