December 2026 Updates: నవంబర్ నెల ఇంకో మూడు రోజుల్లో అయిపోబోతోంది. సరిగ్గా 1 డిసెంబర్ 2026 నుంచి దేశంలో కొన్ని పెద్ద మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఇంటి వంటగది (kitchen) దగ్గర మొదలై, కారు కొనుగోలు, కమోడిటీ ట్రేడింగ్, ఇంకా జీఎస్టీ (GST) నిబంధనల దాకా వీటి ప్రభావం గట్టిగానే పడబోతోంది. ఆ మార్పులు ఏంటో, మన జేబుపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో ఒకసారి క్లియర్‌గా చూద్దాం.
ప్రతి నెలా ఒకటో తారీఖున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (oil marketing companies) ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరలను మారుస్తాయి కాబట్టి, డిసెంబర్ 1న అందరి కళ్లు వీటిపైనే ఉంటాయి. ముఖ్యంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లలో వచ్చే మార్పులు హోటళ్లు, రెస్టారెంట్లలో (restaurants) తినే తిండి ఖర్చుపై ప్రభావం చూపిస్తాయి. అయితే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (domestic gas cylinder) ధర చాలా కాలంగా స్థిరంగానే ఉంది. గ్యాస్ సిలిండర్లతో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF – aviation turbine fuel) ధరల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఇక, కారు కొందామనుకునే వాళ్లకు కొంచెం నిరాశ కలిగించే విషయం. టాటా మోటార్స్ (Tata Motors) తన కార్లు, ఎస్‌యూవీల (SUVs) ధరలను డిసెంబర్ 1 నుంచి పెంచబోతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) మీద కూడా ఈ ధరల పెంపు ఉంటుంది. నవంబర్ 24న టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata Motors Passenger Vehicles) ఈ విషయాన్ని ప్రకటించింది. వేరియంట్‌ను (variant) బట్టి సుమారు 0.5 శాతం వరకు ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తీసుకొచ్చిన సెంట్రల్ జీఎస్టీ (CGST) రూల్స్ మారనున్నాయి. నవంబర్ 25న నోటిఫై చేసిన ఈ నిబంధనల ప్రకారం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ (GST) అప్లికేషన్ ప్రాసెస్‌లో మార్పులు చేశారు. అర్హత ఉన్న దరఖాస్తులను జీఎస్టీ కామన్ పోర్టల్ (GST common portal) ద్వారా ఎలక్ట్రానిక్‌గా ప్రాసెస్ చేస్తారు. కానీ రిటర్నులు (returns) పెండింగ్‌లో ఉన్నా, బకాయిలు (dues) ఉన్నా అలాంటి వాటిని పరిశీలన కోసం సంబంధిత అధికారికి (proper officer) పంపిస్తారు.

