NTV Telugu Site icon

Fake Notes: కలవరపెడుతున్న రూ. 200 ఫేక్ నోట్లు.. మీ దగ్గర ఉన్నాయా? ఇలా గుర్తించండి!

Rs 200 Notes

Rs 200 Notes

మార్కెట్ లో నకిలీ నోట్ల బెడద ప్రజలను కలవరపెడుతున్నది. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దొంగ నోట్ల తయారీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రూ.500 ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. ఇప్పుడు రూ. 200 దొంగ నోట్లు మార్కెట్ లోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది.

మరి మీ దగ్గర కూడా రూ. 200 నోట్లు ఉన్నాయా?అవి అసలైనవా లేదా నకిలివా అని గుర్తించ లేకపోతున్నారా? అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. దొంగ నోట్లను కనిపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వెబ్ సైట్ లో ఒరిజినల్ నోట్ల ఫీచర్లను తెలుసుకుని కనిపెట్టొచ్చు. ఫేక్ కరెన్సీని గుర్తించేందుకు ఆర్బీఐ కు సంబంధించిన RBI Kehta Hai వెబ్‌సైట్‌లోనే Know Your BankNotes వెళ్లి అక్కడ ఒరిజినల్ నోట్ల ఫీచర్స్ తెలుసుకోవచ్చు.ఒరిజినల్ నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య తేడాలు ఈజీగా గుర్తించొచ్చు. చలామణిలో ఉన్న అన్ని కరెన్సీ నోట్ల ఫీచర్లు తెలుసుకోవచ్చు.

రూ. 200 ఫేక్ కరెన్సీని ఎలా గుర్తించాలంటే.. ఒరిజినల్ నోట్ సైజ్ 66mmX146mm లో ఉంటుంది. నోటుపై మహాత్మా గాంధీ చిత్రానికి ఎడమవైపున దేవనాగరి లిపిలో నిలువుగా రూ. 200 అని రాసి ఉంటుంది. దాని కింద బయటకు కనిపించకుండా 200 అని రాసి ఉంటుంది. మైక్రో లెటర్స్ లో ఆర్బీఐ, భారత్, ఇండియా అని ఉంటుంది. గాంధీ చిత్రం పక్కన నిలువుగా ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్‌లో ఉండి నోటును అటుఇటు కదిపితే బ్లూ కలర్‌లోకి మారుతుంది. దీన్ని టచ్ చేసినప్పుడు వేళ్లకు తగులుతుంది. అలా తగలకపోతే అదిఫేక్ నోట్ అని గుర్తించాలి. గాంధీ చిత్రానికి కుడి వైపున ఆర్బీఐ సింబల్, గవర్నర్ సంతకం దానిపైన ప్రామిస్ క్లాజ్ ఉంటుంది.

నోటుపై ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీ చిత్రం, ఎలక్ట్రోటైప్‌లో రూ. 200 వాటర్ మార్క్ ఉంటుంది. కుడివైపు దిగువన రూ. 200 నంబర్ కింద నంబర్ ప్యానెల్ ఉంటుంది. ఇది చిన్న సైజ్ నుంచి పెద్ద సైజుకు పెరుగుతూ ఉంటుంది. కుడి వైపు చివరన అశోక స్తంభం ఉంటుంది. నోటు చివర్లో రెండు, రెండు చొప్పున అడ్డగీతలు ఉంటాయి. నోటుకు వెనకవైపు నోటు ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ్ భారత్ లోగో, లాంగ్వేజ్ ప్యానెల్, సాంఛీ స్థూపం, చివరగా దేవనాగరి లిపిలో రూ. 200 అని ఉండటం చూడొచ్చు. రూ. 200నోటుపై ఉన్న ఈ ఫీచర్స్ తో నకిలీ నోట్లను గుర్తించొచ్చు. దొంగ నోట్లను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి అడ్డుకట్ట వేయొచ్చు.