Senior Citizen Savings Scheme : భారత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక రకాల ఆర్థిక పథకాలను అందిస్తోంది. అందులో భాగంగానే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ను తీసుకొచ్చింది. SCSS అనేది ఒక చిన్న పొదుపు పథకం. పదవీ విరమణ తర్వాత రెగ్యులర్, హామీతో కూడిన ఆదాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది మంచి పెట్టుబడి ఆప్షన్లలో ఒకటి. SCSS పథకం కింద వడ్డీ చెల్లింపులు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతాయి. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నారు.
ఎవరెవరు అర్హులు ?
ఈ పొదుపు పథకం కింద వయోవృద్ధుల కోసం తెరిచిన ఖాతాలకు ఐదేళ్ల మెచ్యూరిటీ టైమ్ ఉంటుంది. ఈ పథకానికి పెట్టుబడి ఒకేసారి అవసరం అవుతుంది. కనీసం రూ.1,000, గరిష్టంగా రూ. 30,000,00 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఖాతా తెరవడానికి 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 55 నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్య పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. రక్షణ శాఖ సిబ్బంది అయితే 50 నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్య ఖాతా తెరవవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టాలి ?
ఈ పథకం కింద నెలకు రూ. 20,000 ఆదాయం వడ్డీగా పొందాలనుకుంటే, రూ.29,30,000 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. సీనియర్ సిటిజన్ పొదుపు పథకంలో రూ. 29,30,000 జమ చేస్తే… ప్రతి మూడు నెలలకు మొత్తం రూ.60,064 వడ్డీ లభిస్తుంది. అంటే మీకు నెలకు రూ.20,021 వస్తాయి. ఈ విధంగా ఐదు సంవత్సరాల పాటు ప్రతీ నెల రూ.20,021 వడ్డీ చెల్లింపులను అందుకుంటారు.
మెచ్యూరిటీ తర్వాత గడువును 3 సంవత్సరాలు పొడిగించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత, కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి, ఇందులో ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదు. ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ పొదుపు పథకం కింద ఖాతా తెరవాలంటే ఏదైనా ప్రధాన ప్రభుత్వ బ్యాంకును సందర్శించవచ్చు. లేదంటే సమీపంలోని పోస్ట్ ఆఫీసులో కూడా అకౌంట్ తెరవవచ్చు.

