Site icon NTV Telugu

HDFC APK File Scam: ఏపీకే ఫైల్స్‌తో స్కామ్‌.. హెచ్‌డీఎఫ్‌సీ సీరియస్ వార్నింగ్!

Hdfc

Hdfc

HDFC APK File Scam: సైబర్‌ నేరగాళ్లు ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్స్‌తో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. వీటి సహాయంతో స్మార్ట్‌ఫోన్లను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని డబ్బును దోచేస్తున్నారు. అయితే, ఈ తరహా ఫైల్స్‌ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా హెచ్చరించింది. మీ మొబైల్‌కు వచ్చే ఎలాంటి ఏపీకే ఫైల్స్‌నూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని పేర్కొనింది. కస్టమర్లు దయచేసి థర్డ్‌ పార్టీ యాప్స్ వాడొద్దని, ఏవైనా లింక్‌లు వచ్చినపుడు పంపిన వ్యక్తి నమ్మదగిన వారేనా? కాదా అని చెక్ చేసుకోవాలని వెల్లడించింది.

Read Also: Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద.. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేశారు..

ఇక, సైబర్‌ నేరస్థులు తాము బ్యాంకు ఎంప్లాయ్స్, ప్రభుత్వ అధికారులం అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఆ తర్వాత ఓ ఏపీకే ఫైల్‌ను మీ ఫోన్ లోకి పంపించి యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని చెబుతున్నారని పేర్కొనింది. అయితే, ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే బాధితుల మొబైల్‌ ఫోన్‌పై ఈ మోసగాళ్లకు పూర్తి నియంత్రణ దక్కుతుందన్నారు. దీంతో మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంక్ ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా మీ ఫోన్‌కు వచ్చే కాల్స్‌, మెసేజ్‌లను వేరే డివైజ్‌కు ఈ సైబర్ నేరగాళ్లు మళ్లించగలరు.. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్‌ వివరాలు, ఓటీపీలపైనా వారికి పూర్తి అధికారం లభిస్తుంది.. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చెప్పుకొచ్చింది. ఏవైనా సైబర్ స్కామ్ జరిగితే సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ https://sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయాలని తెలియజేసింది.

Exit mobile version