దేశంలో అక్టోబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను శుక్రవారం కేంద్రం వెల్లడించింది. వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయని తెలిపింది. అక్టోబర్ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్లు చెప్పింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.33,821 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.41,864 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.99,111 కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో రూ.12,550 కోట్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్ నెల వసూలైన రూ.1.72 లక్షల కోట్లతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.9 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలు 10.6 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4 శాతం మేర పెరిగి రూ.45,096 కోట్లుగా వసూలైనట్లు కేంద్రం తెలిపింది. అక్టోబర్ నెలలో రూ.19,306 కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది.
2024లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ.12.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ వసూళ్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైన సంకేతాలుగా సూచిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్ల పెరుగుదల సానుకూల పంథా వైపు నడిపిస్తోంది. జూలై 1, 2027 నుంచి దేశంలో వస్తు మరియు సేవల పన్ను అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.