ప్రముఖ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాలో ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ అయిన వీడియో కారణంగా ఆయన రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, దీంతో ఆ నేతకు రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020లో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా జాన్ బరిలారోపై జోర్డాన్ అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు సదరు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలకు దాదాపు 8 లక్షల వ్యూస్ వచ్చాయి.
శాంక్స్ చేసిన పని వల్ల ఆస్ట్రేలియన్ మాజీ శాసనసభ్యుడు జాన్ బరిలారో 2021లో రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. దీంతో ఆయన యూట్యూబ్ యాజమాన్య సంస్థ గూగుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. రాజకీయ ప్రతినిధిని అవహేళన చేస్తూ ఆధారాలు లేకుండా యూట్యూబ్ వీడియోలను ప్రసారం చేసి గూగుల్ వేలాది డాలర్లు సంపాదించిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో గూగుల్ తీరు సరికాదని.. జాన్ పరువుకు భంగం కలిగించినందుకు సుమారు రూ.4కోట్లు పరిహారంగా చెల్లించాలని గూగుల్‌ను కోర్టు ఆదేశించింది.