Gold and Silver Prices: సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతోన్న బంగారం, వెండి ధరలు నేడు పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో శుక్రవారం మార్కెట్లలో హడావుడి కనిపించింది. గురువారం వరకూ రికార్డు స్థాయిలను తాకిన ఈ ధరలు ఒక్కరోజులోనే దిశ మార్చుకోవడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. దేశీయ మార్కెట్, ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ మూడు శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. బంగారం ధర దాదాపు ఒకటిన్నర శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికాలో కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కరోజులోనే రెండు శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. గురువారం వెండి కిలోకు రూ.4,20,000 పైగా, బంగారం 10 గ్రాములకు రూ.1,80,000 దాటిన తర్వాత ఈ పతనం రావడం గమనార్హం.
READ MORE: Naari Naari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఈ అంశంపై నిపుణులు షాకింగ్ కారణాలను చెబుతున్నారు. డాలర్ మళ్లీ బలపడుతోందని ఇదే ఈ మార్పునకు కారణమని అంటున్నారు. డాలర్ విలువ పెరగడంతో బంగారం, వెండిపై అమ్మకాలు పెరిగాయని.. చాలా రోజులుగా పెరుగుతూనే ఉన్న ధరలు ఒక్కసారిగా తగ్గడంతో పెట్టుబడిదారులు లాభాలు బుక్ చేసుకోవడం మొదలుపెట్టారని స్పష్టం చేశారు. డాలర్ సూచీ ఇటీవల తక్కువ స్థాయిల నుంచి మళ్లీ పైకి రావడం, రూపాయితో పోలిస్తే డాలర్ రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ ఒత్తిడి పడిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా భారత్‌లో బంగారం డిమాండ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని తాకడంతో నగల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, 2025 చివరి త్రైమాసికంలో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొంత తగ్గాయని, అయితే పెట్టుబడిదారుల ఆసక్తి మాత్రం బలంగా ఉందని తెలిపింది. ధరలు పడిపోయినా, మొత్తం నెలను చూస్తే బంగారం, వెండి ఇప్పటికీ చరిత్ర సృష్టించాయి. 1980ల తర్వాత బంగారానికి ఇదే అత్యుత్తమ నెలగా మారనుంది. వెండి అయితే జనవరిలోనే 50 శాతం కంటే ఎక్కువ లాభం చూపించే దిశగా ఉంది. ఇది ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయి అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వడ్డీ విధానంపై మారుతున్న అంచనాలు, డాలర్ బలహీనతే ఈ భారీ ర్యాలీకి కారణమని వారు అంటున్నారు.
READ MORE: Dhurandhar: ఓటీటీలోకి ధురంధర్, నెట్‌ఫ్లిక్స్ తీరుపై ఆగ్రహం.. కారణాలేంటి..?
ఈ ప్రభావం ఈటీఎఫ్‌లపై సైతం పడింది. బంగారం, వెండి ఆధారిత ఈటీఎఫ్‌లు ఒక్కరోజులోనే 10 నుంచి 14 శాతం వరకు పడిపోయాయి. జనవరిలో భారీగా పెరిగిన వెండి ఈటీఎఫ్‌లు ఇప్పుడు ఎక్కువగా నష్టపోయాయి. బంగారం ఈటీఎఫ్‌లు కూడా గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రపంచ మార్కెట్లో వెండి ధర రికార్డు స్థాయి నుంచి దాదాపు ఆరు శాతం పడిపోయింది. బంగారం కూడా ఒకే రోజు నాలుగు నుంచి ఐదు శాతం వరకు క్షీణించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ ఎంపికపై వార్తలు రావడం, కఠినమైన ద్రవ్య విధానం వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు పెట్టుబడిదారులను కలవరపెట్టాయి. మార్కెట్ నిపుణులు మాత్రం ఇది తాత్కాలిక ఊగిసలాటే అని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, యుద్ధ పరిస్థితులు, ఆర్థిక భయాలు ఇంకా కొనసాగుతున్నాయని, అందుకే బంగారం, వెండికి దీర్ఘకాలంలో మద్దతు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ధరల్లో తీవ్ర ఊగిసలాట ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
