Site icon NTV Telugu

Copper Price: బంగారం, వెండి మాత్రమే కాదు.. రాగి ధరలు కూడా రికార్డు స్థాయికి..!

Copper Price

Copper Price

Copper Price: అంతర్జాతీయంగా రాగి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఓవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు రాగి ధరలు కూడా ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర టన్ను 12000 డాలర్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాగి ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. ఇండియాలోని MCXలో దాదాపు కిలో రాగి 1140 రూపాయల నుంచి 1160 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. 2025లో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగింది.

Read Also: Off The Record: కర్నూలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. ఆశావహులకు తప్పని నిరాశ..!

ట్రంప్ సుంకాలతో రాగి ధర పెరుగుతుందేమోనని చాలామంది నిల్వ చేసుకుంటున్నారు. దీని వల్ల సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. అలాగే అంతర్జాతీయంగా రాగి ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. ధరలు పెరగడానికి ఇది మరోక కారణం. గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, తక్కువ పెట్టుబడులు, డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల రాగికి డిమాండ్ పెరుగుతోంది. సరఫరా సమస్యల కారణంగా పెట్టుబడిదారులు రాగిని కొనుగోలు చేస్తున్నారు. రాగికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా మూడు రంగాలు కారణమవుతున్నాయి. మొదటిది ఎలక్ట్రిక్ వాహనాలు. సాధారణ పెట్రోల్ కార్ కంటే ఎలక్ట్రిక్ కార్ తయారీలో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ రాగి అవసరమవుతుంది. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. భారీ డేటా సెంటర్ల నిర్వహణకు, విద్యుత్ ప్రసరణకు అత్యుత్తమ వాహకమైన రాగి ఎంతో కీలకం. మూడవది, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం నిర్మిస్తున్న పవర్ గ్రిడ్లు. ఈ రంగాల విస్తరణ వల్ల 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాపర్ రేట్లు పెరుగుతుండటంతో వీటిని కొత్త బంగారం లేదా వెండిగా బిజినెస్ అనలిస్టులు పిలుస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రియల్ మెటల్ అయిన కాపర్‌పై పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

కాగా, బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. మరోసారి లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది గోల్డ్. ఈ మార్క్‌కు గోల్డ్ రేటు చేసుకోవడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈ వారం ప్రారంభం నుంచే బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. వేలకు వేలు పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులకు భారంగా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం ఏకంగా తులం బంగారంపై 770 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగి లక్షా 40వేల 20 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి లక్షా 28వేల 350 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు అదే జోరును కొనసాగిస్తున్నాయి. యూఎస్ స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం పెరిగి ఔన్సు 4,501.44 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మొత్తం మీద బంగారం ధరలు 70 శాతానికి పైగా పెరిగాయి.

వెండి విషయంలో అయితే ధరల పెరుగుదల మరింత వేగంగా సాగుతోంది. వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ వెండి ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. మార్చి వెండి ఫ్యూచర్స్ దాదాపు 4 శాతం పెరిగి కిలోకు 2లక్షల 32వేల 741 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో శుక్రవారం కేజీ ధర ఏకంగా 2 లక్షల 37వేలు పలికింది. 2025 ప్రారంభం నుంచి వెండి ధర దాదాపు 158 శాతం వరకు పెరిగింది. 2025 జనవరి 1న కేజీ వెండి 90,500 పలికింది. సరిగ్గా 2025 డిసెంబర్ 26న కేజీ వెండి ధర 2 లక్షల 37వేలు పలుకుతోంది. దీన్నిబట్టి వెండి ధర ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. బంగారాన్ని కూడా మించి వెండిపై రాబడులు రావడం పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచింది. బలమైన పెట్టుబడి డిమాండ్, వెండిని అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చడం, అలాగే మోమెంటమ్ ఆధారిత కొనుగోళ్లు వెండి ధరలకు ప్రధాన బలంగా మారాయి. వెనిజులా నుంచి ముడి చమురు రవాణాను అడ్డుకుంటూ అమెరికా విధించిన ఆంక్షలు, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నైజీరియాలోని ISIS స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, కార్మిక మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం. ఈ కారణాలన్నీ బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

Exit mobile version