Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!

Gold

Gold

Gold Theft Protection: బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్న ఈ రోజుల్లో, కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నగలను ఇంట్లో ఉంచాలంటేనే భయమేస్తోంది. ఊరెళ్లినా, ఇంట్లో ఉన్నా దొంగల బెడద ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే మన కారుకు, ఆరోగ్యానికి బీమా చేయించుకున్నట్లే.. బంగారు ఆభరణాలకు కూడా ప్రత్యేకంగా గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ దిగులే ఉండదు. ఇంట్లో దొంగతనం జరిగినా, అనుకోని ప్రమాదంలో నగలు పాడైనా ఒక్క రూపాయి నష్టపోకుండా ఈ పాలసీ మీ బంగారానికి అండగా నిలుస్తుంది. అసలు నగలకు బీమా ఎలా చేయించాలి? పరిహారం ఎలా అందుతుందో వివరంగా చూద్దాం.

ఇంట్లోని బంగారానికి రక్షణ కల్పించుకోవడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది స్పెషల్ జ్యువెలరీ ఇన్సూరెన్స్. కేవలం బంగారు నగలకు మాత్రమే ఉద్దేశించిన ఈ పాలసీ దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదాల నుంచి ఆభరణాలకు కవచంలా పనిచేస్తుంది. రెండోది హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్.. మీరు ఇప్పటికే ఇంటికి బీమా తీసుకుని ఉంటే, దానికి కొద్దిపాటి అదనపు ప్రీమియం చెల్లించి నగలను కూడా ఆ పాలసీలో చేర్చుకోవచ్చు. HDFC ERGO, హోమ్ షీల్డ్ వంటి పాలసీలు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి. అయితే ఇంటి బీమా ఉన్నంత మాత్రాన బంగారం దానంతట అదే కవర్ అవ్వదని గుర్తుంచుకుని, నగల వివరాలను ప్రత్యేకంగా పాలసీలో యాడ్ చేయించాలి.

బీమా తీసుకునే ముందు మీ దగ్గరున్న నగల అసలు విలువను లెక్కించి, దానికి సరిపడా కవరేజ్ ఎంచుకోవాలి. ఇందుకోసం బంగారం కొనుగోలు రశీదులు, వాల్యుయేషన్ సర్టిఫికెట్, ఆభరణాలు స్పష్టంగా కనిపించే ఫొటోలు, మీ ఐడీ ప్రూఫ్‌లను బీమా సంస్థకు అందించాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఇంట్లో దొంగలు పడి నగలు ఎత్తుకెళ్తే, ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. ఆ వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారమిచ్చి ఎఫ్ఐఆర్ కాపీ, బంగారం బిల్లులు, పాలసీ డాక్యుమెంట్లు సమర్పించాలి. సంస్థ తరఫున సర్వేయర్ వచ్చి విచారణ జరిపిన తర్వాత, నిబంధనల ప్రకారం మీకు రావాల్సిన పరిహారాన్ని అందిస్తారు.

క్లెయిమ్ చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నగలు దొంగతనానికి గురయ్యాయని నిరూపించే బలమైన ఆధారాలు ఉండాలి తప్ప, “ఇంట్లో పెట్టిన బంగారం కనిపించడం లేదు” అని చెబితే బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అందుకే బంగారం కొన్న వెంటనే బిల్లులను జాగ్రత్తగా దాచుకోవడంతో పాటు నగల బరువు, నాణ్యత వివరాలు, ఫొటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. సరైన పత్రాలు లేకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుజాగ్రత్తగా బిల్లులు భద్రపరుచుకుని, తగిన జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. దొంగల భయం లేకుండా మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.