పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. అమాంతంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజనల్లు నడుస్తున్నాయి. ఇప్పటికే అధిక ధరలతో కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాంటిది శుక్రవారం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. తొలిసారి బంగారం ధర రూ. 83,000 దాటింది. శుక్రవారం ఢిల్లీలో తొలిసారిగా రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.83,000 మార్కును అధిగమించింది. 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.83,100 తాజా జీవితకాల గరిష్ట స్థాయిని తాకిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. గురువారం బంగారం 10 గ్రాములకు రూ.82,900 దగ్గర ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.83 వేలు దాటింది. ఈ మార్కు దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు వెండి సైతం కిలోకు రూ.500 మేర పెరిగింది. ట్రేడింగ్‌లో రూ.93,500గా ఉన్న వెండి కిలో తాజాగా రూ.94 వేల మార్కుకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంతో అనిశ్చితి కొనసాగుతోంది.