Gold Purity Test: మీ నగలు అసలైనవేనా? మార్కెట్లో ‘చైనా పౌడర్’ కల్తీ కలకలం.. ఈ టెస్టులతో సింపుల్‌గా పట్టేయండి!

Gold Adulteration

Gold Adulteration

Gold Purity Test: మీ బీరువాలో ఉన్న బంగారు నగలు నిజంగానే స్వచ్ఛమైనవా? లేక కల్తీ మాయాజాలంలో చిక్కుకున్నాయా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే, సాధారణ తనిఖీలకు కూడా అస్సలు దొరకని ఒక కొత్త రకం కల్తీ పద్ధతి ఇప్పుడు బంగారం మార్కెట్లో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు బంగారంలో రాగి, వెండి కలిపి కల్తీ చేసేవారు. కానీ ఇప్పుడు కొందరు కేటుగాళ్లు ‘రెనియం పౌడర్’ అనే అత్యంత బరువైన లోహపు పొడిని వాడుతున్నారు. చూడటానికి బంగారం రంగు, బరువు ఉండే ఈ పొడిని మార్కెట్లో ‘గోల్డ్ పౌడర్’ పేరుతో చలామణి చేస్తున్నారు. కల్తీ రాయుళ్లు దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని, మహారాష్ట్ర, బెంగాల్ మీదుగా దేశంలోని పలు మార్కెట్లకు తరలిస్తున్నట్లు బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింఘాల్ బయటపెట్టారు.

ఈ మోసం ఎంత పక్కాగా జరుగుతుందంటే.. ఉదాహరణకు 7.83 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలో కేవలం 1 గ్రాము ఈ చైనా పౌడర్ కలిపితే దాని బరువు 8.83 గ్రాములు అవుతుంది. సాధారణ టెస్టుల్లో చెక్ చేస్తే అది 24 క్యారెట్ల బంగారమే అని చూపిస్తుంది. కానీ అందులో అసలు బంగారం కేవలం 90 శాతం (దాదాపు 22 క్యారెట్లు) మాత్రమే ఉంటుంది. గత రెండు మూడేళ్లుగా రెనియం, రుథేనియం, ఇరిడియం, ఆస్మియం వంటి భారీ లోహాలతో ఈ దందా సాగుతోంది. కొన్ని షోరూమ్‌లు, సాధారణ టెస్టింగ్ సెంటర్ల కళ్లుగప్పి కూడా ఈ నగలు పాస్ అవుతుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

మీ బంగారం అసలైనదో కాదో ఈ 5 టెస్టులతో పెట్టేయండి..

ఈ కల్తీ బారిన పడకుండా ఉండాలంటే కొనేముందు లేదా మీ దగ్గరున్న నగల స్వచ్ఛతను ఈ కింది పద్ధతుల ద్వారా సింపుల్‌గా చెక్ చేసుకోండి..

1. BIS హాల్‌మార్క్ & HUID కోడ్ చెకింగ్: మీ నగపై BIS హాల్‌మార్క్‌తో పాటు 6 అంకెల HUID కోడ్ ఉందో లేదో చూడండి. 22 క్యారెట్లకు 916, 18 క్యారెట్లకు 750 అని రాసి ఉంటుంది. ప్రభుత్వ అధికారిక ‘BIS Care’ యాప్‌లో ఆ 6 అంకెల HUID కోడ్ ఎంటర్ చేస్తే చాలు.. ఆ నగ అసలైనదా, కాదా అనే పూర్తి జాతకం సెకన్లలో తెలిసిపోతుంది.

2. XRF మెషిన్ టెస్ట్: నగలపై ఎలాంటి గీతలు పడకుండా, బంగారాన్ని కరిగించకుండా స్వచ్ఛతను తెలుసుకునే అత్యుత్తమ పద్ధతి ఇది. XRF (ఎక్స్-రే ఫ్లోరోసెన్స్) మెషిన్‌లో పెడితే బంగారంలో ఏ లోహం ఎంత శాతంలో ఉందో కచ్చితంగా తేలిపోతుంది. గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ సెంటర్లలో ఈ టెస్ట్ చేయించుకోవచ్చు.

3. యాసిడ్ & టచ్‌స్టోన్ టెస్ట్: నల్లటి ప్రత్యేక రాయి (టచ్‌స్టోన్) పై నగను సున్నితంగా గీసి, దానిపై నైట్రిక్ యాసిడ్ చుక్కలు వేస్తారు. ఆ యాసిడ్‌కు లోహం స్పందించే తీరును బట్టి బంగారం అసలైనదో కాదో నిపుణులు గుర్తిస్తారు. (ఇది ఇంట్లో సొంతంగా కాకుండా నిపుణుల దగ్గరే చేయించాలి).

4. మాగ్నెట్ (అయస్కాంత) టెస్ట్: ఇది ఇంట్లోనే చేసుకునే సింపుల్ ప్రాథమిక పరీక్ష. స్వచ్ఛమైన బంగారం ఎప్పటికీ అయస్కాంతానికి అతుక్కోదు. ఒకవేళ మీ నగ అయస్కాంతం వైపు ఆకర్షితమైతే అందులో ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.

5. వాటర్ టెస్ట్: బంగారం సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నీటి గ్లాసులో వేయగానే తేలకుండా నేరుగా అడుగుకు వెళ్లి కూర్చుంటుంది. అయితే రెనియం వంటి ఇతర భారీ లోహాలు కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇది కేవలం ప్రాథమిక అంచనాకు మాత్రమే పనికొస్తుంది.

కాబట్టి బంగారం కొనేటప్పుడు కేవలం డిజైన్లు చూసి మురిసిపోకుండా, HUID కోడ్ చెక్ చేయడం, గుర్తింపు పొందిన ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టులు తీసుకోవడం ద్వారా ‘చైనా పౌడర్’ కల్తీ మోసాల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చు.