NTV Telugu Site icon

Go First Troubles: ‘ఫస్ట్’.. మా విమానాలు మాకిచ్చేయండి. ఆ తర్వాత.. మీరేమైనా చేసుకోండి

Go First Troubles

Go First Troubles

Go First Troubles: వ్యాపారం అన్న తర్వాత ఎన్నో విషయాలు గోప్యంగా ఉంటాయి. వ్యవహారం మంచిగా నడుస్తున్నప్పుడు ఏవీ బయటికి రావు. బిజినెస్ ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేసిందో.. ఇక ఒకదాని తర్వాత ఒకటి బట్టబయలు అవుతాయి. దీనికి తాజా ఉదాహరణగా గోఫస్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఈ సంస్థ దగ్గర ఎన్ని విమానాలు ఉన్నాయి?, అవి ఆ కంపెనీ సొంతమా? (లేక) లీజుకు తీసుకున్నవా? అనే అంశాలు సాధారణ జనానికి ఎవరికీ తెలియవు. కానీ.. ఇప్పుడు తెర మీదికి వస్తున్నాయి.

read more: Low Cost Electric Bike: ఇంతకన్నా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బైక్ రావటం కష్టమే

గోఫస్ట్ సంస్థకు లీజుకిచ్చిన 20 విమానాలను తమకు తిరిగివ్వాలని కొన్ని కంపెనీలు కోరుతున్నాయి. ఈ మేరకు విమానయాన నియంత్రణాధికార సంస్థ.. డీజీసీఏ తలుపుతట్టాయి. విమానాలను రూల్స్ ప్రకారం తమకు ఇచ్చేసి, డీజిసర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాయి. స్వచ్ఛంద దివాలా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ గోఫస్ట్ సంస్థ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి అప్లై చేసిన సంగతి తెలిసిందే. వివిధ కంపెనీలకు తాము చేయాల్సిన పేమెంట్లపై మారటోరియం విధించాలని కూడా గోఫస్ట్ రిక్వెస్ట్ చేసింది.

అయితే.. ఈ మారటోరియం విజ్ఞప్తిని సైతం లీజు సంస్థలు తప్పుపట్టాయి. ఈ కంపెనీల లిస్టులో.. సీడీబీ ఏవియేషన్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, సోనోరాన్ ఏవియేషన్ కంపెనీలు ఉన్నాయి. ఈ విషయాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ నెల రెండో తేదీ నాటికి.. గోఫస్ట్ వద్ద ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలు 20 ఉండగా వాటిలో 15 మాత్రమే రాకపోకలు సాగించాయి. అనంతరం.. ఈ సర్వీసులన్నింటినీ గోఫస్ట్ ఈ నెల 12వ తేదీ వరకు క్యాన్సిల్ చేసింది.

ఇదిలాఉండగా.. పేమెంట్లపై మారటోరియం విధించాలన్న తమ విజ్ఞప్తిని లీజు సంస్థలు వ్యతిరేకించటంపై గోఫస్ట్ స్పందించింది. దివాలా ప్రక్రియకు స్వచ్ఛందంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించింది. కంపెనీని కాపాడుకోవటానికే తప్ప రుణదాతలకు బకాయిల చెల్లింపులను నిలిపివేయటం కోసం కాదని స్పష్టం చేసింది. సంస్థలో పనిచేస్తున్న 7 వేల మంది ఉద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అత్యవసర మధ్యంతర మారటోరియానికి అనుమతించాలని కోరింది.

వాడియా గ్రూప్ కంపెనీ అయిన గోఫస్ట్.. ప్రస్తుతానికి.. వివిధ సంస్థలకు 11 వేల 463 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ సంస్థ దివాలా ప్రక్రియకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్‌లను ఎన్‌సీఎల్‌టీ ఎల్లుండి సోమవారం విచారణకు చేపట్టనుంది. అప్పుడుగాని.. గోఫస్ట్ భవితవ్యం ఏంటనేది తేలదు.

Show comments