ప్రస్తుతం యువత లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాలను వదిలేసి, స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. టీ స్టాళ్లు, కాఫీ షాపులు, టిఫిన్ సెంటర్లు వంటి చిన్న వ్యాపారాల నుంచి స్టార్టప్‌ల వరకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మోహన్. జర్మనీలోని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్‌లో ఉద్యోగాన్ని వదిలేసి దోశల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ యువకుడి కథ ఇప్పుడు అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, మోహన్ పారిస్‌లో స్కాలర్‌షిప్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం జర్మనీలో ఇంటెల్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీల్లో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాల్లో పని చేశాడు. అయితే ఈ ఉద్యోగాలు అతనికి అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. తనలోని ప్యాషన్‌ను అనుసరించాలనే ఆలోచనతో 2023లో తన స్నేహితులతో కలిసి “దోసమా” అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు.
ఇంటెల్ వంటి భారీ టెక్ కంపెనీలోని ఉద్యోగాన్ని వదిలేసి దోశల వ్యాపారం ప్రారంభించడాన్ని చూసి మొదట్లో చాలామంది ఇది ఒక “విచిత్రమైన నిర్ణయం” అంటూ విమర్శించారు. కానీ మోహన్ మాత్రం దీనిని తన కలగా భావించి, విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేశాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. “అమెరికా బర్గర్లు, ఇటలీ పిజ్జాలు భారత్‌కు వచ్చాయి కదా… మరి భారతీయ వంటకాలు పారిస్‌కు ఎందుకు వెళ్లకూడదు?” అనే ఆలోచనతో యూరప్‌లో “దోసమా” ఔట్‌లెట్లను ప్రారంభించాడు.
ఈరోజు “దోసమా” పారిస్ నుంచి లండన్ వరకు విస్తరించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా మారింది. భారతీయ ఆహార సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా మోహన్ ముందుకు సాగుతున్నాడు. డిసెంబర్ 2025లో పుణేలోని ఎఫ్‌సీ రోడ్డుపై “దోసమా” బ్రాంచ్ ప్రారంభం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం మోహన్ ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశపు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడని అనేక మంది అతన్ని అభినందిస్తున్నారు.
