Foreign Investors Withdraw: భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. ఒక ఆగస్టు నెలలోనే దలాల్ స్ట్రీట్ నుంచి రూ.18 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మొదటి త్రైమాసికంలో కంపెనీల బలహీన ఫలితాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి విలువ పతనం కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు ఆగడం లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా మార్కెట్లో కూడా చాలా ఒత్తిడి కనిపిస్తోందని అన్నారు. గత వారంలో స్టాక్ మార్కెట్ మందకొడిగా కొనసాగింది. వారంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం.. మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 765.47 పాయింట్లు పడిపోయి 79,857.79 వద్ద ముగిసింది. సూచి పతనానికి ప్రధాన కారణాలలో ఒకటి మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు వేగంగా డబ్బును ఉపసంహరించుకోవడమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
READ MORE: Bengaluru: మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించిన మోడీ.. కాసేపు నవ్వుకున్న నేతలు
ఇప్పటివరకు రూ.1.13 లక్షల కోట్లు…
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPI) 2025లో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ నుంచి రూ.1.13 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం.. ఆగస్టు 1 – 8 మధ్య, FPIలు షేర్ల నుంచి రూ.17,924 కోట్లు ఉపసంహరించుకున్నారు. జూలైలో కూడా రూ.17,741 కోట్లు ఉపసంహరించుకున్నారు. కానీ మార్చి, జూన్ మధ్య కాలంలో భారత స్టాక్ మార్కెట్‌లో FPI లు రూ.38,673 కోట్లు పెట్టుబడి పెట్టారు. మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇటీవల చోటుచేసుకుంటున్న విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరణలకు భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, రూపాయి విలువ తగ్గడం కారణమని అన్నారు. జూలై చివరలో అమెరికా భారతీయ వస్తువులపై 25% సుంకం విధించింది. దానికి గత వారం అదనంగా 25% సుంకాన్ని జోడించింది. ఇది మార్కెట్లో భయాన్ని, షేర్ల విక్రయానికి కారణం అయ్యిందని అభిప్రాయపడ్డారు.
ఏంజెల్ వన్ విశ్లేషకుడు వకార్ జావేద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈపరిస్థితి FPI సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని, పెట్టుబడిదారులు రిస్క్-విముఖత వ్యూహాన్ని అనుసరించారని అన్నారు. అమెరికా బాండ్ దిగుబడి పెరుగుదల కారణంగా విదేశీ మూలధనం అమెరికా వైపు కదులుతోందని పేర్కన్నారు. అయితే, ఈ కాలంలో, FPIలు సాధారణ రుణ పరిమితిలో రూ.3,432 కోట్లు, VRRలో రూ.58 కోట్లు పెట్టుబడి పెట్టాయి. భవిష్యత్తులో FPI సెంటిమెంట్ బలహీనంగా ఉండవచ్చని, వచ్చే వారం మార్కెట్ దిశను వాణిజ్య చర్చలు, సుంకాల వివాదాలు నిర్ణయిస్తాయని ఖాన్ తెలిపారు.
READ MORE: Sangareddy: రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మర్గమధ్యలోనే ప్రసవం..