EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం

Epfo

Epfo

EPFO ECR Filing Deadline: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. ఇక, ఇప్పుడు యజమానులకు భారీ ఊరటనిచ్చింది EPFO… సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ఫైలింగ్ గడువును మరో 16 రోజులు పొడిగించింది. తొలుత అక్టోబర్ 15, 2026 వరకు ఉన్న గడువును అక్టోబర్ 31 వరకు పెంచినట్లు EPFO సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వేతన పరిమితిలో మార్పుల నేపథ్యంలో యజమానులకు అదనపు సమయం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

ECR అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) అనేది యజమానులు ప్రతి నెలా EPFO పోర్టల్‌లో దాఖలు చేసే ఎలక్ట్రానిక్ రిటర్న్. ఇందులో ఉద్యోగుల వేతనాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకాలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ల వివరాలు ఉంటాయి.

వేతన పరిమితి పెంపుతో మారిన లెక్కలు
ప్రభుత్వం సెప్టెంబర్ 17న వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఈ మార్పుతో సెప్టెంబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ల లెక్కింపులో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు పాత రూ.15,000 పరిమితి ప్రకారం, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు పెరిగిన రూ.25,000 పరిమితి ప్రకారం కాంట్రిబ్యూషన్లను లెక్కించాల్సి ఉంటుంది..

యజమానులకు ఎందుకు అదనపు గడువు?
వేతన పరిమితిలో మార్పుల కారణంగా సెప్టెంబర్ నెల ECR దాఖలు చేయడం యజమానులకు కొంత క్లిష్టంగా మారింది. గతంలో ఒకే వేతన పరిమితి ఆధారంగా రిటర్నులు దాఖలు చేసే విధానంలో మార్పులు రావడంతో లెక్కల సర్దుబాటుకు అదనపు సమయం అవసరమైంది. ఈ నేపథ్యంలో EPFO తొలుత అక్టోబర్ 15గా నిర్ణయించిన గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది.

రూ.20,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి సంబంధించి ECRను ఎలా దాఖలు చేయాలనే వివరాలను కూడా EPFO సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. కాబట్టి యజమానులు కొత్త వేతన పరిమితికి అనుగుణంగా కాంట్రిబ్యూషన్లను లెక్కించి, గడువులోగా సెప్టెంబర్ నెల ECR ఫైలింగ్ పూర్తి చేయాలి. కాగా, వేతన పరిమితిలో మార్పుల కారణంగా.. గతంలో మొత్తం జీతం అందుకునే ఉద్యోగులకు కూడా ఇప్పుడు ఆయా సంస్థల యాజమాన్యాలు కోతలు పెట్టాయి.. మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. యజమానులకు కొంత సమయం దొరికింది..