దేశీయ విమాన రంగ చరిత్రలో తొలిసారి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణాలు చేశారు. ఒకే రోజులు 5 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశ వ్యాప్తంగా పండుగలు, పెళ్లిళ్లు సీజన్‌లు ఉండడంతో ఒక్కసారిగా ఈ డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తోంది. ఆదివారం దాదాపు 90 శాతం ఆక్యుపెన్సీ కంటే ఎక్కువ ఉందని నిపుణులు చెబుతున్నారు.
దాదాపు అన్ని ఎయిర్ సంస్థలు కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో నడిచినట్లుగా తెలుస్తోంది. శీతాకాలం ఈ విధంగా ప్రయాణం చేయడం ఇదే తొలిసారి అని ప్రముఖ ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ పట్వారీ తెలిపారు. గతేడాది కంటే ఎక్కువగా ఈ శీతాకాలం ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పుకొచ్చారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం 5, 05, 412 మంది ఆదివారం (నవంబర్ 17) ప్రయాణం చేసినట్లు పేర్కొంది. దాదాపు 3, 173 విమాన సర్వీసులు నడిచినట్లుగా తెలిపింది.
మరోవైపు వివిధ కారణాల వల్ల ఆదివారం విమానాల సమయపాలన (ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్- OTP) ప్రభావితం అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం ఇండిగో ఓటీపీ 74.2 శాతంగా ఉండగా.. అలయన్స్ ఎయిర్ 71%, ఆకాశ ఎయిర్ 67.6%, స్పైస్‌జెట్ 66.1%, ఎయిరిండియా 57.1% శాతంగా ఉంది. అక్టోబర్ 27 నుంచి 2024 మార్చి 29 వరకు వింటర్ సీజన్ కొనసాగుతుంది.