Site icon NTV Telugu

WhatsApp: తస్మాత్ జాగ్రత్త.. వాటిని టచ్ చేస్తే జైలుకే!

Whatsapp Alerts On This

Whatsapp Alerts On This

Do Not Share These Harmful Messages On WhatsApp: వాట్సాప్.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక ముఖ్య భాగమైపోయింది. ఉదయం లేచిన వెంటనే.. మొదటగా ఈ యాప్ ఓపెన్ చేయడం అందరికీ ఒక పరిపాటి అయిపోయింది. ప్రతీ సంభాషణ ఈ యాప్ ద్వారానే కొనసాగిస్తారు. అలాగే సరదా ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంటారు. అసలు వాట్సాప్ లేకపోతే, రోజు గడవదన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే తప్పుడు వార్తలకు వాట్సాప్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

ఏదైనా ఒక విషయం కాస్త ఆసక్తిగా అనిపిస్తే చాలు.. అది నిజమా? కాదా? అని నిజానిజాలు నిర్ధారించుకోరు. అదేదో ఆస్కార్ సాధించేశామన్న లెవెల్‌లో, వెంటనే షేర్ చేయాలని ఆ వార్తల్ని గ్రూపుల్లో షేర్ చేస్తారు. అవతలి వ్యక్తులూ అంతే! తామే ముందుగా ఫార్వర్డ్ చేయాలని, పోటీ పడి మరీ ఆ వార్తల్ని ఫార్వర్డ్ చేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని డేంజరస్ వార్తలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి మెసేజ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సూచిస్తోంది. ఫార్వర్డ్ చేయాలన్న కక్కుర్తి ఏది పడితే ఆ న్యూస్ షేర్ చేస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆ సూచనలేంటో, ఏయే వార్తలు షేర్ చేయకూడదో తెలుసుకుందాం పదండి..

టెర్రరిస్టులు, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. లేకపోతే శిక్షలు తప్పవు. దేశ భద్రత దృష్ట్యా.. ప్రభుత్వం ఇలాంటి కంటెంట్‌ షేరింగ్ మీద నిఘా పెట్టింది. అలాగే.. ఎదుటి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే మెసేజ్‌లు షేర్ చేయరాదు. వాటి వల్ల కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న తరుణంలో.. ఆ మెసేజ్‌లపై సీరియస్‌గా ఉన్నారు. అశ్లీల కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో షేర్‌ చేయకూడదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ షేర్ చేస్తే.. గ్రూప్‌ అడ్మిన్‌తో పాటు, షేర్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తప్పవు. కాపీరైట్‌ ఉన్న కంటెంట్‌ను జోలికి ఏమాత్రం వెళ్లకూడదు. ఇవే.. ఆ సూచనలు. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త!

Exit mobile version