Decreasing use of debit cards: క్యాష్ లెస్ లావాదేవీల వైపు దేశం పరుగుపెడుతోంది. గతంలో పోలిస్తే కొన్నేళ్లుగా నగదు వినియోగం తగ్గిపోయి అంతా యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కు అలవాటు పడ్డారు. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు లావాదేవీలన్నీ ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా జరుగుతున్నాయి. చివరు ఏటీఎంలలో కూడా నగదు తీసుకోవడానికి కార్డు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెబిట్ కార్డుల వినియోగం తగ్గిపోతోంది. దేశంలో యూపీఐ ఆధారిత లావాదేవీలు పెరుగుతున్నాయి. చిన్న బడ్డికట్టు దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ దాకా యూపీఐ చెల్లుబాటు అవుతోంది. ఫిబ్రరి నాటికి 66.4 శాతం వార్షిక వృద్ధితో రూ. 126 లక్షల కోట్ల విలువ గల 750 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఒక్క మార్చిలోనే గణనీయమైన వృద్ధి ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గణాంకాలు తెలుపుతున్నాయి.
యూపీఐతో మోసాలకు చెక్..
గతంలో డెబిట్ కార్డులు విస్తృతంగా వాడేవారు. అయితే యూపీఐ రావడం, సురక్షిత చెల్లింపులు జరుగుతుండటంతో ప్రజలు దీనికే మొగ్గు చూపిస్తున్నారు. తరుచూ డెబిట్ కార్డులను జేబులో పెట్టుకునే బదులు సెల్ ఫోన్ తో పనులు అయిపోతుండటంతో కార్డుల వినియోగం తగ్గతోందని నిపుణులు చెబుతున్నారు. డెబిట్ కార్డులతో మోసాలు జరిగేవి. పిన్ నెంబర్, క్లోనింగ్ వంటి ఫ్రాడ్స్ జరిగాయి. అయితే ఎప్పుడైతే యూపీఐ వచ్చిందో ఈ మోసాలకు అడ్డుకట్ట పడినట్లు అయింది. దీంతో ఇటీవల కాలంలో పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలు వినియోగం తగ్గిపోయింది. క్యూఆర్ కోడ్ ఉంటే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయి.
ఇదిలా ఉంటే డెబిట్ కార్డుల వినియోగం తగ్గిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్‌సైట్లో కొనుగోలు చేసేటప్పుడు రాయితీలను అందిస్తున్నాయి. అయినా కూడా డెబిట్ కార్డులకు పెద్దగా ఆదరణ కనిపించడం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.