ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిపిందు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధరలు కాస్త కిందకు దిగొచ్చాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా ముగియకున్నా.. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ముడి చమురు దరలు మాత్రం తగ్గడం విశేషం. చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో బ్యారెల్‌పై 3.12 శాతం మేర ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర 99.67 డాలర్లుగా ఉంది.
మరోవైపు లిబియాలో చమురు సరఫరా పెరగడంతో రానున్న రోజుల్లో క్రూడ్ అయిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చమురు ధరలు తగ్గినా భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించడానికి ఆయిల్ కంపెనీలు వెనుకాడుతున్నాయి. ముడి చమురు ధర ఇంకొన్ని రోజులు తగ్గుదల పాటిస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గడంతోనే 19 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.119.49గా ఉంది. డీజిల్ ధర రూ.105.49గా ఉంది. అటు విజయవాడలో పెట్రోల్ ధర 27 పైసలు తగ్గి లీటరుకు రూ.121.56గా ఉంది. డీజిల్ ధర 27 పైసలు తగ్గి రూ.107.12గా నమోదైంది.
