Colgate: కొల్గేట్‌ ప్రియులకు షాక్‌.. టూత్‌పేస్ట్‌ ధరలు పెరగనున్నాయా?

Colgate

Colgate

Colgate: సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ ఓరల్‌ కేర్‌ సంస్థ కొల్గేట్‌-పామోలివ్‌ ఇండియా రానున్న త్రైమాసికాల్లో తమ ఉత్పత్తుల ధరలను మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండటంతో.. లాభాల మార్జిన్‌ను కాపాడుకునేందుకు ధరల పెంపు దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశమేనని కంపెనీ సీఈఓ, ఎండీ ప్రభా నరసింహన్‌ తెలిపారు. అయితే ధరల విషయంలో సున్నితంగా ఉండే వినియోగదారులపై అధిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రూ.10, రూ.20 ప్యాక్‌లలో అదనపు గ్రామేజీ

జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు గతేడాది చిన్న ప్యాక్‌ల బరువును పెంచినట్లు ప్రభా నరసింహన్‌ తెలిపారు. ప్రస్తుతం కూడా ఆ అదనపు గ్రామేజీని కొనసాగిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రూ.10, రూ.20 ప్యాక్‌లలో పెంచిన బరువును అలాగే ఉంచినట్లు వెల్లడించారు. దీంతో వినియోగదారులకు మెరుగైన విలువ లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే పెరుగుతున్న ముడి పదార్థాల ధరల నేపథ్యంలో ఇటీవలి త్రైమాసికాల్లో కొల్గేట్‌ ఉత్పత్తుల ధరలను సింగిల్‌ డిజిట్‌ స్థాయిలో స్వల్పంగా పెంచినట్లు సమాచారం. భవిష్యత్తులోనూ ఎంపిక చేసిన ఉత్పత్తులపై ధరల పెంపు ఉండే అవకాశం ఉంది. ఇన్‌పుట్‌ ఖర్చులను నియంత్రించడంతో పాటు అమ్మకాలను పెంచుకునేందుకు ప్రీమియం ఉత్పత్తులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. కొల్గేట్‌ ప్రకారం.. ప్రీమియం విభాగం మొత్తం మార్కెట్‌ వృద్ధి రేటుతో పోలిస్తే సుమారు ఆరు రెట్లు వేగంగా పెరుగుతోంది. టూత్‌పేస్ట్‌, టూత్‌బ్రష్‌ విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ఓరల్‌ కేర్‌ మార్కెట్‌లో కొల్గేట్‌కు పెప్సోడెంట్‌, క్లోజప్‌, సెన్సోడైన్‌, పతంజలి వంటి బ్రాండ్ల నుంచి పోటీ ఉంది. అదే సమయంలో కోర్‌ బ్రాండ్లను మరింత బలోపేతం చేసేందుకు ప్యాకేజింగ్‌, ఉత్పత్తి అనుభవాన్ని మెరుగుపరచాలని కంపెనీ భావిస్తోంది.

గ్రామీణ మార్కెట్లలో పెరిగిన అమ్మకాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తుల లభ్యత పెరగడం, ఆదాయాలు మెరుగుపడటం, నోటి ఆరోగ్యంపై అవగాహన పెరగడం వంటి కారణాలతో అమ్మకాల పరిమాణం పెరిగినట్లు కొల్గేట్‌ తెలిపింది. అయితే తక్కువ వర్షపాతం నేపథ్యంలో భవిష్యత్తులో గ్రామీణ డిమాండ్‌పై కంపెనీ ఎలాంటి స్పష్టమైన అంచనా వెల్లడించలేదు. మరోవైపు ‘పామోలివ్‌’ పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రభా నరసింహన్‌ తెలిపారు. డైరెక్ట్‌-టు-కన్స్యూమర్‌, ఈ-కామర్స్‌ విభాగాల్లో బ్రాండ్‌ ఉనికిని పెంచేందుకు బాంబే షేవింగ్‌ కంపెనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా పెరుగుతున్న ముడి పదార్థాల వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య ఎంపిక చేసిన ధరల పెంపు, ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి, వాల్యూమ్‌ ఆధారిత వృద్ధి వ్యూహాలతో కొల్గేట్‌ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.